Begin typing your search above and press return to search.

మిత్రుడికి వినూత్నంగా చంద్రబాబు శుభాకాంక్షలు!

సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ తన 55వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 10:09 AM GMT
మిత్రుడికి వినూత్నంగా చంద్రబాబు శుభాకాంక్షలు!
X

జనసేనాని, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు, వివిధ పార్టీల నేతలు, జనసేన పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు చెప్పారు.

సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ తన 55వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. దీంతో వెల్లువలా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తన మిత్రుడికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలురాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నాను. చలన చిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కల్యాణ్‌ రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని... అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అంటూ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో చంద్రబాబు ఒక పోస్టు చేశారు. అలాగే చంద్రబాబు, పవన్‌ కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న ఫొటోను కూడా ఈ పోస్టుకు జత చేశారు.

మరోవైపు చంద్రబాబు తనయుడు, విద్య, ఐటీల శాఖల మంత్రి నారా లోకేశ్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ కు శుభాకాంక్షలు చెప్పారు. ‘రియల్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌ అన్నకు హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్‌ స్టార్‌ గా నిలిచావు. రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్‌ కళ్యాణ్‌ గారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌ డే పవన్‌ అన్న’’ అంటూ నారా లోకేశ్‌ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టుకు లోకేశ్, పవన్‌ కలిసి ఉన్న ఫొటోను జత చేశారు.

వీరిద్దరే కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల అధినేతలు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తదితరులు పవన్‌ కళ్యాణ్‌ కు శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు.

కాగా పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటిలానే తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌ విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టాలని పవన్‌ పిలుపునిచ్చారు.