బాబు పొత్తులేమో కానీ తమ్ముళ్ల సీట్లు పోతున్నాయట!
అయితే.. మారిన పరిస్థితుల్లో 30-40 వరకు సీట్లను కేటాయించాల్సి వస్తోందన్న ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ వాదన మొత్తం తెలుగు తమ్ముళ్ల వర్గాల నుంచే రావటం ఆసక్తికరం.
By: Tupaki Desk | 10 Feb 2024 7:30 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలితో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తుంది. పొత్తుల విషయంలో వారి తీరు బాబు మాదిరే ఉన్నా.. తమ అధిక్యం తగ్గేలా పొత్తుల లెక్కలు పోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరేం అనుకున్నా 2014 నాటి కాంబినేషన్ తో మాత్రమే ఈ ఎన్నికల్ని ఎదుర్కోగలుగుతున్నామనే భావిస్తున్నారు. అయితే.. ఇందుకోసం ఎక్కువ సీట్లు మిత్రులకు ఇవ్వాల్సి రావటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏడాది క్రితం జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించే సీట్ల పైన భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. ఒక వాదన ప్రకారం 20కు మించి ఇచ్చే అవకాశం లేదని.. ఆ మాటకు వస్తే 15 సీట్లు ఎక్కువగా టీడీపీ వర్గాలు వాదించేవి. అయితే.. మారిన పరిస్థితుల్లో 30-40 వరకు సీట్లను కేటాయించాల్సి వస్తోందన్న ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ వాదన మొత్తం తెలుగు తమ్ముళ్ల వర్గాల నుంచే రావటం ఆసక్తికరం.
15-20 సీట్లు కాస్తా చూస్తుండగానే 30-40 వరకు వెళ్లటం చూస్తున్న తమ్ముళ్లు రగిలిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇచ్చే సీట్లకు రెట్టింపు సీట్లు ఇవ్వటమంటే.. ఆ మందంగా తెలుగుతమ్ముళ్ల సీట్లను బలి పెట్టాల్సి ఉంటుందన్నది ఇప్పుడు సమస్యగా మారింది. ఇప్పటికే ఐదేళ్లుగా అధికారంలో దూరంగా ఉండటం.. ఇప్పుడు మిత్రుల కోసం తమ సీట్లు చిరిగిపోవటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒకదశలో పొత్తు అంశాన్ని పక్కన పెట్టేసి.. ఒంటరిగా బరిలోకి దిగి తర్వాత చూసుకుందామన్న ప్రపోజల్ సైతం తెలుగు తమ్మళ్ల నుంచి వచ్చింది. కాకుంటే.. చంద్రబాబు మాత్రం దీనికి ససేమిరా అన్నట్లుగా చెబుతున్నారు. మారుతున్న పరిస్థితులను చూస్తే.. మిత్రుల కోసం సొంతోళ్లను బలి పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు పొత్తుల పంచాయితీ సంగతి తర్వాత.. తమకు కేటాయించాల్సిన టికెట్లను మిత్రులకు ఇచ్చేయటం ద్వారా తమ అవకాశాలు మూసుకుపోవటాన్ని తెలుగు తమ్మళ్లు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు.