బాబు... జగన్ ల మధ్య వయసు పోరు...!
జగన్ చంద్రబాబుని కూడా ఏమీ తక్కువ అనడం లేదు. బాబుని పట్టుకుని నారాసురుడు అని తరచూ సెటైర్లు వేస్తూ వస్తున్నారు.
By: Tupaki Desk | 30 March 2024 3:34 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘమైన అనుభవం ఉన్న వారు అయినప్పటికీ ఆయన ఎక్కువగా వ్యక్తిగత విమర్శలకు ఇటీవల కాలంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన జగన్ మీద తీవ్ర విమర్శలే చేస్తూ వస్తున్నారు. జగన్ ని సైకో అంటున్నారు. ఆయన రాక్షసుడు దుర్మార్గుడు అని కూడా అంటున్నారు.
జగన్ చంద్రబాబుని కూడా ఏమీ తక్కువ అనడం లేదు. బాబుని పట్టుకుని నారాసురుడు అని తరచూ సెటైర్లు వేస్తూ వస్తున్నారు. అదే విధంగా బాబును ముసలాయన అని టీజ్ చేస్తున్నారు. నిజానికి రాజకీయాల్లో ఈ తరహా విమర్శలు తగునా అంటే అటూ ఇటూ అనుకుంటున్నారు.
ఎవరికి వారు తాము తక్కువ తినలేదు అంటున్నారు దాని వల్ల ఇది అలాగే కంటిన్యూ అవుతోంది. ఇక బాబుని పట్టుకుని జగన్ ఎన్ని మాటలు అన్నా చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ వయసు మీద విమర్శలు చేస్తే మాత్రం అసలు తట్టుకోలేకపోతున్నారు.
గతంలోనూ జగన్ కి ఈ విషయంలో సవాల్ చేశారు. ప్రశ్నలు సంధించారు. దాంతో పాటుగా జగన్ నా వయసుని ఎగతాళీ చేస్తావా అంటూ మండిపడ్డారు. లేటెస్ట్ గా బస్సు యాత్రలో జగన్ చంద్రబాబు ఏజ్ ని మరోమారు కెలికారు. ఈ డెబ్బయి అయిదేళ్ళ ముసలాయన ఏపీని పాలించారు, జనాలకు ఏమి చేశారు అని జగన్ నిలదీశారు.
దానికి చంద్రాబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సీఎం జగన్ జగన్ నా వయసు గురించి మాట్లాడతాడు. ఆయన ఏమి అనుకుంటున్నాడు అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసలు నా మాదిరిగా మండుటెండలో ఒకే రోజు మూడు మీటింగులలో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా ఈ జగన్ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్ ను చంద్రబాబు ఏకంగా పిల్లకాకితో పోల్చారు. నాలాగా రెండు రోజులు మధ్యాహ్నం ఒంటిగంటకు మంచి ఎండలో మీటింగ్ లు పెట్టగలవా అని సవాల్ విసిరారు. పనిదొంగ, దోపిడీదారుడు ఈ జగన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను వయసులో పెద్ద అయినా సమర్ధుడను, రోజుకు ఇరవై గంటలు పనిచేసే నవ యువకుడిని అని చంద్రబాబు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు.
రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పమంటే నా వయసు గురించి ముఖ్యమంత్రికి ఏమి సంబంధం అని ఆయన నిలదీశారు. ఇక ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని కూడా ఈ జగన్ అడుగుతున్నాడు. అసలు నేను చేసిన మేలు ఏంటి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను అడిగినా చెబుతారు నేను ఏం చేశానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం చేయగలం అని కూడా బాబు సెటైర్లు వేశారు.
మొత్తానికి జగన్ బాబుల మధ్య మరోసారి వయసు పోరుకు తెర లేచింది. ఇది ఆరంభం మాత్రమే జగన్ రానున్న రోజుల్లో బాబుని ముసలాయన అని ఆయన వల్ల ఏపీకి ఏమి అవసరం అని కూడా విమర్శలు చేసే అవకాశం ఉంది అంటున్నారు. బాబు ఏజ్ బార్ పొలిటీషియన్ అని చెప్పడం జగన్ ఉద్దేశ్యం. అయితే తాను డైనమిక్ లీడర్ ని బిగ్ సౌండ్ చేస్తూ బాబు కూడా కౌంటర్ ఇస్తున్నారు. మరి జనాలు ఈ ఇద్దరి మాటలను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.