బాబు.. జగన్ : ఎవరు సీఎం అయితే మాకేంటి....!?
ఏపీలో ఎవరు సీఎం అవుతారు అన్నది పెద్దగా క్యూరియాసిటీ లేని ప్రశ్నగా ఉంది. దానికి కారణం ఆ ఇద్దరే మళ్లీ పోటీలో ఉండడం.
By: Tupaki Desk | 25 Dec 2023 12:30 AM GMTఏపీలో ఎవరు సీఎం అవుతారు అన్నది పెద్దగా క్యూరియాసిటీ లేని ప్రశ్నగా ఉంది. దానికి కారణం ఆ ఇద్దరే మళ్లీ పోటీలో ఉండడం. ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబు జగన్ రాజకీయ ప్రత్యర్ధులుగా నిలిచారు. 2014లో ఈ ఇద్దరి మధ్యన రాజకీయ యుద్ధం తొలిసారి స్టార్ట్ అయింది. అప్పట్లో ప్రజలు చంద్రబాబు విజనరీ అని చెప్పి ఓట్లేశారు.
బాబు ఆనాటికే రెండు సార్లు సీఎం గా చేశారు. అరవై ఏడేళ్ల వయసులో బాబుని ముచ్చటగా మూడవసారి సీఎం ని చేశారు ప్రజలు అంటే ఆయన అనుభవాన్ని నమ్మడమే. దాంతో పాటు నాలో ఇక నుంచి కొత్త బాబుని చూస్తారు అని కూడా భారీ ప్రకటనలు చంద్రబాబు ఇచ్చారు. తీరా అయిదేళ్ల పాలన బాబు ఉమ్మడి ఏపీ చీఫ్ మినిస్టర్ గా చేసిన దాంతో పోలిస్తే తీసికట్టుగా మారింది.
ఇచ్చిన హామీలు అయితే ఏమీ నెరవేర్చలేదు అన్న అసంతృప్తి జనాలకు ఉంది. దాంతో 2019 ఎన్నికల నాటికి జగన్ కి చాన్స్ ఇచ్చారు. ఆనాడు కూడా పోటీ ఈ ఇద్దరు మధ్యనే బాబు కావాలా జగన్ కావాలా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. పైగా అప్పటికి పదేళ్ళుగా జగన్ రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్సార్ వారసుడిగా ఆయన తాను ఏపీకి ఎంతో చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు.
ఏపీలో వైసీపీ పాలనకు అయిదేళ్ళు నిండుతున్నాయి. పాలన ఎలా ఉంది అంటే బాగున్న వారికి బాగుంది లేని వారికి లేదు. ఇక జగన్ సీఎం అన్న కొత్తదనం కూడా అయిపోయింది. 2024 ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ బాబా జగనా అని జనాల వద్దకు వెళ్ళి అడిగితే మాకు వేరే ఆప్షన్ లేదా అని జనాలు అనుకుంటున్న నేపధ్యం.
నిజానికి ఏపీలో రాజకీయ శూన్యత చాలా ఉంది. దాన్ని సరిగ్గా క్యాచ్ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాడుకుని ఉంటే బాగుండేది అన్న మాట ఉంది. పవన్ జనసేన సభలకు జనాలు తండోపతండాలుగా రావడం ఒక సూచన మాత్రమే. వారాహి యాత్ర పేరిట పవన్ జనంలోకి వస్తే అద్భుతమైన స్పందన వచ్చింది.
ఇక ధర్మం ప్రకారం ఒక చాన్స్ బాబుకు మరో చాన్స్ జగన్ కి ఇచ్చిన జనాలు మూడవ చాన్స్ పవన్ కి కూడా ఇచ్చేవారేమో. కానీ పవన్ మాత్రం ఆ రిస్క్ తీసుకోదలచుకోలేదు. నేను ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందను అంటూ టీడీపీతో పొత్తుకు వెళ్లారు. దాంతో ఏపీకి జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అంటే చంద్రబాబు నో డౌట్ అంటున్నారు నారా లోకేష్.
అంటే మళ్లీ రొటీన్ పాలిటిక్స్ తప్ప కొత్తదనం ఏముంది అన్నది ఏపీ జనాల మాటగా ఉంది. అదే తెలంగాణాలో అయితే రేవంత్ రెడ్డి కొత్త ముఖంగా జనం ముందుకు వచ్చారు. ఆయన్ని జనాలు ఆదరించారు. కేసీయార్ లాంటి కొండను ఢీ కొట్టిన రేవంత్ కి ఓటెత్తారు. అలా కొత్తదనం తెలంగాణా ఎన్నికల్లో కనిపించి జనాలను పోలింగ్ స్టేషన్ల వైపుగా నడిపించింది. కానీ ఏపీలో అలాంటి నేపధ్యం లేదు.
రెండు పార్టీలు ఇద్దరు నాయకులు రెండే ఆప్షన్లు, దాంతో పాటు కులాల సంకుల సమరం. దీంతో జనాలు విసిగి వేసారి పోతున్నారు. ఏపీ రాజకీయానికి కొత్తదనం కావాలి. కొత్త నీరు కావాలని అందరికీ ఉంది. అది మాత్రం జరగడంలేదు. దాంతో ఒక రకమైన నిర్వేదంతో ప్రజలు ఉన్నారు.
ఏపీలో ఇపుడు ఎవరి నోట విన్నా ఒకటే మాట. ఎవరు సీఎం అయినా ఒక్కటే అని. సర్వేల పేరుతో ఎవరైనా ప్రజలను కదిలించినా ఏముంది మాకు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇంతేగా అంటూ నిట్టూర్పులు వేడిగా వస్తున్నాయి. దటీజ్ ఆంధ్రా ఓటర్ గ్రౌండ్ లెవెల్ రియాక్షన్ అని అంటున్నారు.