Begin typing your search above and press return to search.

ఏపీ జనాలకు బీపీ.. షుగర్ లు పెరగటం తగ్గిందట!

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు గత నవంబరులో జరిగితే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఈ మేలో జరిగాయి.

By:  Tupaki Desk   |   19 Jun 2024 6:25 AM GMT
ఏపీ జనాలకు బీపీ.. షుగర్ లు పెరగటం తగ్గిందట!
X

పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలైనా.. రెండు రాష్ట్రాల్లోని తెలుగోళ్లను చూస్తే.. తూర్పు పడమర మాదిరి వ్యవహరిస్తారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ వేళలో నాటి ఉద్యమ నేత కేసీఆర్ తరచూ రెండు ప్రాంతాల తెలుగోళ్ల మధ్య తేడాలను అదే పనిగా ప్రస్తావించేవారు. ఆహార అలవాట్లు.. కట్టు..బొట్టు.. ఆలోచనా ధోరణి.. సంప్రదాయాలు.. ఇలా ఎందులోనూ ఇద్దరు ఒకేలా వ్యవహరించరని చెప్పేవారు. ప్రత్యేకంగా రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన ఈ పదేళ్ల కాలంలో రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న అనేక పరిణామాల్ని చూసినప్పుడు.. వివిధ సందర్భాల్లో రెండు రాష్ట్రాల్లోని ప్రజలు స్పందించే తీరును చూసినప్పుడు.. కేసీఆర్ మాటలు అక్షర సత్యంగా చెప్పక తప్పదు.

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు గత నవంబరులో జరిగితే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఈ మేలో జరిగాయి. రెండు చోట్ల ప్రభుత్వాలు మారాయి. రెండు చోట్ల అధికారపక్షానికి పరాజయం తప్పలేదు. విపక్షాలు విజయం సాధించాయి.ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంలో.. రెండు ప్రాంతాల్లోని ప్రజల తీర్పు ఒకటే అయినా.. వారి భావోద్వేగాలు.. వారు స్పందించే తీరులో మాత్రం తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

ఏపీలో ఎన్నికలకు ముందు వాతావరణం అదేదో యుద్ధం జరుగుతున్నట్లుగా.. ఇరు పక్షాలకు చెందిన ప్రజలు ఎన్నికలను తమ సొంత యుద్ధంగా ఫీల్ కావటం.. అందుకు తగ్గట్లే వారి వ్యవహారశైలి ఉండేది. దీంతో.. వ్యక్తిగత స్థాయిలో ఎన్ని గొడవలో.. మరెన్ని రచ్చలో చెప్పలేని పరిస్థితి. సామాన్య ప్రజల మధ్యనే రాజకీయ వైరం ఇంతలా ఉంటే.. నేతల మధ్య మరెంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో.. అధికార వైసీపీ నేతల మాటల తీరు ఎంతలా మారిందో.. దానికి కౌంటర్ ఇచ్చేందుకు వారి ప్రత్యర్థులు మరెంతలా రియాక్టు అయ్యారో తెలిసిందే.

నేతల మధ్య రచ్చే ఇంతలా ఉంటే.. సామాన్య ప్రజలు మరెంత సీరియస్ గా విషయాన్ని తీసుకున్నారో చూడాలి. పోలింగ్ అనంతరం కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గ్రామాల్లోని మహిళలు.. తమ మగాళ్లకు కర్రలు.. కారంపొడి.. ఇలాంటి ఆయుధాలు ఇచ్చి రాజకీయ ప్రత్యర్థులతో పోరాడాలంటూ పంపటమే కాదు.. ఓవైపు రక్తం కారే తలలకు మందు వేస్తూనే.. మరోవైపు పోరులో అలిసే తమ వాళ్లకు మంచినీళ్లు ఇవ్వటం లాంటివి చూసినప్పుడు.. ఏపీలో ఏమవుతోంది? ఇదేం రాజకీయ వైరమన్న భావన కలిగిన పరిస్థితి.

కట్ చేస్తే.. ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. కూటమి నేతలు సైతం కలలో కూడా ఊహించని చారిత్రక విజయాన్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు ఇవ్వటంతో.. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు అన్నట్లుగా లెక్కలు తేలిపోయాయి. దీంతో.. గెలిచినోళ్ల అధిక్యత.. ఓడినోళ్ల తగ్గుదల కనిపించేసింది. ఫలితాలు వెల్లడైన వారం వరకు వ్యవహారాలు కాస్తంత వేడి వేడిగా ఉన్నా.. వాతావరణం చల్లబడటానికి పెద్దగా టైం తీసుకోలేదనే చెప్పాలి. దీనికితోడు టీడీపీ కూటమి అధినేతలు మొదలు నేతల వరకు రెచ్చగొట్టటం.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం లాంటివి లేకపోవటంతో.. వాతావరణం ఆటోమేటిక్ గా మారింది. దీంతో.. గతానికి భిన్నంగా కాస్తంత సంస్కరవంతమైన రాజకీయాలు మొదలైనట్లుగా చెబుతున్నారు.

నోటికి వచ్చినట్లుగా మాట్లాడినా.. గీత దాటే ధోరణిలో బలుపు ప్రదర్శించినా ఒప్పుకోని చంద్రబాబు, పవన్ కారణంగా ఆయా పార్టీ నేతలు తొందరపాటు మాటలకు.. చర్యలకు తెర తీయటం లేదు. కవ్వించేవాడు ఉంటే..ఎదుటోడు కంట్రోల్ తప్పుతాడు కానీ.. ఇరిటేట్ చేయాల్సినోడే జాగ్రత్తగా ఉండటంతో రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందంటున్నారు. ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా మాట్లాడే మాటల్ని విని.. బీపీ.. షుగర్ లను పెంచేసుకునే చాలామందికి ఇప్పుడు వాతావరణం కాస్తంత ప్రశాంతంగా ఉంటున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. మొత్తంగా ట్రిపుల్ ఎక్స్ సబ్బుల యాడ్ లో వినిపించే ‘సంస్కారం’ తాజా పాలనలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది.