Begin typing your search above and press return to search.

విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా డాక్టర్ బాబు...?

ఈ నేపధ్యంలో విజయనగరం ఎంపీ సీటుకి సరైన అభ్యర్ధిని నిలబెడితే కచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు కూడా జిల్లాలో ఎక్కువగా గెలుచుకోవచ్చు అన్నది ఆ పార్టీ హై కమాండ్ స్ట్రాటజీగా చెబుతున్నారు

By:  Tupaki Desk   |   28 Nov 2023 2:30 AM GMT
విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా డాక్టర్ బాబు...?
X

విజయనగరం జిల్లాలో వైసీపీకి గట్టి పట్టుంది. ఈ రోజుకీ మెజారిటీ సీట్లలో ఆ పార్టీ స్ట్రాంగ్ గానే ఉంది. 2019 ఎన్నికల్లో చూస్తే మొత్తం తొమ్మిది అసెంబ్లీ ఒక ఎంపీ సీటుని ఆ పార్టీ కైవశం చేసుకుంది. ఈసారి కొన్ని సీట్లు తగ్గినా మెజారిటీ సీట్లు వైసీపీకి వస్తాయని అంటున్నారు.

ఈ నేపధ్యంలో విజయనగరం ఎంపీ సీటుకి సరైన అభ్యర్ధిని నిలబెడితే కచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు కూడా జిల్లాలో ఎక్కువగా గెలుచుకోవచ్చు అన్నది ఆ పార్టీ హై కమాండ్ స్ట్రాటజీగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే విజయనగరం ఎంపీ సీటుకు అనూహ్యమైన అభ్యర్ధి పేరు ప్రచారంలోకి వస్తోంది. ఆయన ఎవరో కాదు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకైక కుమారుడు డాక్టర్ బొత్స సందీప్.

బొత్స తన కుమారుడిని రాజకీయ వారసుడిగా చూడాలని భావిస్తున్నారు. బొత్స ఇదే విషయం అధినాయకత్వం వద్ద కూడా ప్రస్తావించినట్లుగా పేర్కొంటున్నారు. అయితే హై కమాండ్ ఏ మేరకు హామీ ఇచ్చిందో అన్నది తెలియదు కానీ ఈసారి తప్పకుండా జూనియర్ బొత్స రాజకీయ రంగ ప్రవేశం ఖాయమని అంటున్నారు

అయితే ఆయన అసెంబ్లీకా ఎంపీగా అన్న చర్చ సాగుతున్న నేపధ్యంలో ఎంపీగానే పోటీ చేస్తారు అని అంటున్నారు. నిజానికి చూస్తే బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయించాలన్నది హై కమాండ్ ప్రతిపాదనగా ఉంది అంటున్నారు. ఆమె గతంలో ఎంపీగా ఒకసారి గెలిచారు. అంతకు ముందు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు.

రాజకీయంగా అనుభవం ఉండడంతో పాటు మహిళగా విద్యావంతురాలిగా ఆమెను ముందు తెస్తే అన్ని విధాలుగా బాగుంటుంది అని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. అయితే బొత్స మాత్రం తన కుమారుడికి టికెట్ అడుగుతున్నారని అంటున్నారు. దాంతో బొత్స సందీప్ ఈసారి ఎంపీ గా వైసీపీ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు.

సందీప్ తండ్రి చాటుగా ఉంటూ రాజకీయాలను గమనిస్తున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో కూడా ఆయన పర్యటించి అక్కడ పరిస్థితులను సైతం అర్ధం చేసుకుంటున్నారు. సందీప్ రాజకీయాల్లోకి రావాలని చాలా కాలం క్రితమే బొత్స అభిమానులు ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. సందీప్ ప్రతీ పుట్టిన రోజు వేళ కూడా ఈ హంగామా సాగుతూనే ఉంటుంది.

అయితే బొత్స సందీప్ కి టికెట్ ఇచ్చే విషయంలో హై కమాండ్ ఓకే అంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే వైసీపీలో చాలా మంది తమ కుమారులకు టికెట్లు ఇవ్వమని అర్జీలు పెట్టుకుంటున్నారని అంటున్నారు. దాంతో సందీప్ ని కూడా పక్కన పెడతారా లేక బొత్స మాట నెగ్గుతుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతం హెల్త్ ఇష్యూస్ తో రెస్ట్ తీసుకుంటున్న బొత్స తన వారసుడి విషయంలో మరింత గట్టిగా పట్టుపట్టే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు.