కూటమి ఇచ్చిన 25 హామీల అమలే.. బాబుకు అతి పెద్ద సవాల్!
ఏం చేసైనా సరే.. అధికారంలోకి రావాలన్న తపనతో అలివి కాని హామీల్ని కూటమి ఇచ్చిందని.. అందునా చంద్రబాబు ఇచ్చిన హామీలే అత్యధికమని చెబుతున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2024 4:53 AM GMTవెక్కిరించే ఖాళీ ఖజానా. ఆదాయం మూరెడు అయితే.. ఖర్చు బారెడు. దీనికి తోడు డెవలప్ మెంట్ మీదా.. మౌలిక సదుపాయాల మీద భారీగా ఫోకస్ చేయాల్సి రావటం.. పోలవరాన్నిపూర్తి చేయటం.. రాజధాని నిర్మాణంపై అడుగులు పడేలా చేయటం లాంటి పనులు మాత్రమే కాదు.. అన్నింటికి మించిన ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన పాతిక హామీల అమలు ఇప్పుడు పెద్ద సవాలుగా మారుతుందని చెబుతున్నారు.
ఏం చేసైనా సరే.. అధికారంలోకి రావాలన్న తపనతో అలివి కాని హామీల్ని కూటమి ఇచ్చిందని.. అందునా చంద్రబాబు ఇచ్చిన హామీలే అత్యధికమని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే సరిపోదు.. ప్రజలకు ఇచ్చిన హమీల అమలు ఎలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకుంటే.. ఈ హామీల అమలుకు భారీ ఎత్తున నిధులు అవసరం. అయితే.. ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అమలు చేస్తామంటూ కొన్నింటి విషయంలో కమిట్ మెంట్ కూడా ఇచ్చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు ఇచ్చిన హామీల్ని అమలు విషయంలో ఏ మాత్రం లేట్ అయినా.. మొదటికే మోసం వస్తుంది. అయితే.. బాబు అనుభవం మీద తెలుగు తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. కొన్నిసార్లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాలం కలిసి వస్తుందని చెబుతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీకి వచ్చినట్లుగా చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు టీడీపీ, జనసేన సీట్లు ప్రాణవాయివుగా మారిన నేపథ్యంలో.. గతంలో మాదిరి ఏపీ విషయంలో చూసి చూడనట్లుగా ఉండటానికి వీల్లేదు. గతానికి మించి ఏపీకి అపన్న హస్తం ఇవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఏపీ పరిస్థితుల్లో మార్పు వచ్చే వీలుంది.
చారిత్రక గెలుపు వేళ.. చంద్రసేన ఇచ్చిన పాతిక హామీల్ని గుర్తుకు తెచ్చుకున్నంతనే అప్పటివరకు ఉన్న గెలుపు కిక్ దిగిపోయే పరిస్థితి ఉందంటున్నారు. అంత భారీగా ఉన్న హామీల అమలు ప్రశ్నగా మారింది. చంద్రసేన ఇచ్చిన కీలకమైన పాతిక హామీల్ని చూస్తే..
1. మెగా డీఎస్సీ పై మొదటి సంతకం
2. వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు
3. దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు.
4. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు, నెలకి రూ.1500
5.ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం
6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు
7. నిరుద్యోగులకు నెలకి రూ.3000 నిరుద్యోగ భృతి
8. తల్లికి వందనం కింద, ఎంత మంది బిడ్డలు ఉన్నా, ఏడాదికి ఒకో బిడ్డకు రూ.15,000
9. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
10. ప్రతి రైతుకు ఏడాదికి రూ 20 వేల పెట్టుబడి సాయం
11. వాలంటర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10 వేలు
12. ఉచిత ఇసుక
13. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు
14. భూహక్కు చట్టం రద్దు
15. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనక్షన్ ఇచ్చి, స్వచమైన నీరు
16. బీసీ రక్షణ చట్టం
17. పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదోడిని సంపన్నుల్ని చేయడం
18. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్
19. కరెంటు చార్జీలు పెరగవు
20. 50 ఏళ్ళకే బీసీలకు పెన్షన్
21. ప్రతి పేద వాడికి, రెండు సెంట్ల ఇళ్ళ స్థలం
22. ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇళ్ల నిర్మాణం
23. పెళ్లి కానుక కింద రూ.లక్ష
24. మళ్లీ విదేశీ విద్య
25. ఎటువంటి కండిషన్స్ లేకుండా పండుగల వేళ కానుకలు