బాబు కస్టడీ పిటిషన్ వాయిదా... తీర్పు ఎప్పుడంటే...!
ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రేపు (గురువారం) ఉదయం 11:30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది!
By: Tupaki Desk | 20 Sep 2023 12:52 PM GMTటీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ రోజు (బుధవారం) విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రేపు (గురువారం) ఉదయం 11:30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది!
అవును... చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి... ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో... ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యం అని అన్నారు.
అనంతరం.. చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పిన ఏఏజీ... స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉందని అన్నారు. చంద్రబాబుని కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని, ఈ స్కాంలో నిజం బయటకు వస్తుందని స్పష్టం చేశారు!
ఈ సమయంలో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ లు వాదనలు వినిపించారు. అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, చంద్రబాబు అవినీతి చేసినట్టు ఎక్కడా ఆధారాల్లేవని అన్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన రోజే కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
ఇదే సమయంలో... చంద్రబాబును అరెస్టు చేసి సీఐడీ ఆఫీసులో కొన్ని గంటలపాటు విచారించి, ఇప్పుడు మళ్లీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారంటూ తమ వాదనలు వినిపించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన వివిధ కుంభకోణాల కేసులను ఈ సందర్భంగా లూథ్రా ఉదాహరణగా చూపించారని తెలుస్తుంది.
ఇరువైపులా వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు. దీంతో చంద్రబాబుని ఐదు రోజుల పాటు ఏపీ సీఐడీ కస్టడీకి ఇస్తారా.. లేదా.. అనే విషయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. కాగా... ఏసీబీ కోరిన కస్టడీ పిటిషన్ పై ఈ రోజు సుమారు మూడు గంటల పాటు వాదనలు కొనసాగాయి!