బీజేపీతో పవన్ - కమ్యునిస్టులతో కాంగ్రెస్... మధ్యలో కీలకంగా బాబు డెసిషన్!
ఇదే సమయంలో తెలంగాణలో పొత్తుకు అంగీకరిస్తే.. ఏపీలో కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.. కారణం బీజేపీకి కొన్ని విలువలు ఉన్నాయని అంటారు!
By: Tupaki Desk | 26 Oct 2023 6:54 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రచారాలతో బిజీగా ఉన్న పార్టీలు.. పార్టీలు మారుతున్న నేతలు.. ఆ నేతలను బుజ్జగిస్తున్న పెద్దలు.. ప్రస్తుతం తెలంగాణలో ఈ టైపు పొలిటికల్ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ప్రధానంగా ఉన్న పార్టీల నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వారు తీసుకుంటున్న నిర్ణయాలు, వారు చేస్తోన్న ఆలోచనలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది.
అవును... ఎన్డీఏలో ఉన్నానని చెబుతున్న పవన్ కల్యాణ్ ను తెలంగాణలో బీజేపీ ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసేసింది. ప్రసుతానికి పవన్ కల్యాణ్ అంటే... బీజేపీ తానులో ముక్క అని చెప్పాలనుకుంటున్నట్లుంది! బుధవారం ఢిల్లీకి పిలిపించుకుంది, గురువారం టిక్కెట్లపై ఒక క్లారిటీ తెచ్చుకోమంది, శుక్రవారానికి ఫైనల్ చేసేయమందని అంటున్నారు! మరి ఏపీలో జనసేన పొత్తులో ఉన్న సంగతో..? ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతుంది.
కారణం... ఏపీలో టీడీపీ - జనసేన పొత్తులో ఉన్నాయి. ఏపీలో బీజేపీ ఈ కూటమిలో కలుస్తుందా.. లేక, ఏపీలో పవన్ ఇష్టం పవన్ ది అని స్వాతంత్రం ఇచ్చేస్తుందా అనేది బిగ్ క్వశ్చన్! ప్రస్తుతానికైతే తెలంగాణలో బీజేపీకి ఒక క్రౌండ్ పుల్లర్ కావాలి.. అది పవన్ అని బీజేపీ నమ్ముతుంది! కారణం... టీడీపీతో పోలిస్తే జనసేన బలం తెలంగాణలో తక్కువే! అయినప్పటికీ... టీడీపీని కాదని, పవన్ కల్యాణ్ నే బీజేపీ కోరుకుంటుందంటే... టీడీపీపై బీజేపీ ఏస్థాయిలో అనాసక్తి ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.
ఇదే సమయంలో తెలంగాణలో పొత్తుకు అంగీకరిస్తే.. ఏపీలో కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.. కారణం బీజేపీకి కొన్ని విలువలు ఉన్నాయని అంటారు! మరి పవన్ కి అలాంటివి లేవా...? తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో ఎలా..? అనే ప్రశ్నలు ప్రస్తుతానికి అప్రస్తుతం. కారణం ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందిగా! ఇలా బీజేపీ - జనసేన పొత్తు తెలంగాణలో పొడిచింది!
అయితే... ప్రస్తుతానికి తెలంగాణలో కాగ్రెస్ పార్టీ కమ్యునిస్టులను కలుపుని వెళ్తుంది. ఆ సంగతి అటుంచితే... తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పోటీ చేయకపోతే కాంగ్రెస్ కు బలం అనే కామెంట్లు మరోపక్క వినిపిస్తున్నాయి. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిలర్స్ ఓట్లు అత్యంత కీలకం అని అంటారు. ఇక్కడ టీడీపీకి, వైసీపీకి కూడా బాగానే బలం ఉంది!
సపోజ్ ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోతే... ఆ ఓట్లు రేవంత్ చీఫ్ గా ఉన్న కాంగ్రెస్ కు పడతానేది పలువురి అభిప్రాయంగా ఉంది. అంటే... తెలంగాణలో టీడీపీ పోటీకి దిగకపోతే కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని అంటున్నారన్నమాట. అవసరమైతే టీడీపీ ఎన్డీఏ లో లేదు కాబట్టి... టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లించేలా అనధికారిక ప్రకటన కూడా ఇప్పించొచ్చని చెబుతున్నారు. అయితే... చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో టీడీపీనే ఆయనే గొంతు పిసికి చంపేసినట్లనే వాదన కూడా ఉంది!
మరోపక్క ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో పోటీ చేస్తామని అభ్యర్థుల జాబితా పట్టుకుని రాజమండ్రిలో చంద్రబాబుతో ములాకత్ కు రెడీ అయిపోయారు కాసాని జ్ఞానేశ్వర్! ఇందులో భాగంగా ఇప్పటికే 30 మంది అభ్యర్థులను ఖరారు చేసిన కాసాని, మరో 63 నియోజకవర్గాల లిస్టు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు... తూచ్ అని అంటే... కాసాని రియాక్షన్ ఏమిటనేది వేచి చూడాలి!
మరోపక్క ఏపీలో బీజేపీ రహితంగా జనసేన - టీడీపీ మాత్రమే కలిసి పోటీచేస్తే తాముకూడా జతకడదామని కమ్యునిస్టులు కలలు కంటున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. మరి తెలంగాణలో బీజేపీతో కలిసిన జనసేనతో ఏపీలో కమ్యునిస్టులు కలిసి పనిచేస్తారా? ఇది కూడా పెద్ద ప్రశ్నే... అయినప్పటికీ చంద్రబాబు అనుకుంటే సమాధానం పుడుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఇలా ఏపీలో ప్రధానపార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేనలు... తెలంగాణలో ప్రధాన పార్టీలను ప్రభావితం చేసేవిగా, పొత్తు అవసరాలు తీర్చేవిగా మారడం ఆసక్తికలిగించే అంశమే. కాగా... తెలంగాణలో బీజేపీ - జనసేన సీట్ల సర్ధుబాటు వ్యవహారం ఇవాల రేపట్లోగా పూర్తిచేయాలని అమిత్ షా కోరినట్లు చెబుతున్నారు. దీంతో... కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ లు ఇదే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇక టీడీపీ పొటీ, అభ్యర్థుల ఎంపికపై బాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి!