ఎవరు 'పెత్తందార్లో' తేల్చేసిన చంద్రబాబు!
అంతేకాదు.. తన హయాంలో పేదల కోసం తీసుకువచ్చిన పథకాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 15 Aug 2024 10:07 AM GMTఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన అంశం.. `పెత్తందార్లు.. పేదలు`. అప్పటి సీఎం వైసీపీ అధినేత జగన్.. ఈ విషయాన్ని పదే పదే చెప్పుకొచ్చారు. ``ఎన్నికలు పెత్తందార్లు-పేదలకు మధ్య జరుగుతున్నాయి. మీ బిడ్డ పేదల పక్షం. చంద్రబాబు సహా దుష్టచతుష్ట యం.. పెత్తందార్ల పక్షం. మీకు పెత్తందారులు కావాలా.. పేదలపక్షం ఉండే మీ బిడ్డ కావాలా?`` అని ఊరూవాడా ప్రచారం చేశారు. అంతేకాదు.. తన హయాంలో పేదల కోసం తీసుకువచ్చిన పథకాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు.
సరే.. చివరకు ప్రజలు తాము చెప్పాలనుకున్న తీర్పు.. చెప్పేశారు. కట్ చేస్తే.. గత రెండు నెలలుగా రాష్ట్రం జరుగుతున్న పరిణామాలను, ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న ఘటనను పరిశీలిస్తే.. ఎవరు పెత్తందార్లో.. ఎవరు పేదల పక్షపాతో.. టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. పించన్లు ఇంటింటికీ పంపిణీ చేసేందుకు గత రెండు మాసాలుగా చంద్రబాబే స్వయంగా పేదల ఇళ్లకు వెళ్తున్నారు. వారితో కలిసి టీ తాగుతూ... వారి యోగక్షేమాలు, ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ.. పేదల కు భరోసా ఇస్తున్నారు. కానీ, జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఒక్క నిరుపేద ఇంటికి వెళ్లింది లేదు.
కట్‌చేస్తే.. ఇప్పుడు అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసింది. ఆగస్ట 15న దేశనికి స్వాతంత్య్రం వచ్చినట్టుగానే పేదల పొట్టకు కూడా స్వతంత్రం వచ్చిందని పేర్కొంటూ గుడివాడలో చంద్రబాబు తన సతీమణితో కలిసి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది.. చంద్రబాబు దంపతులు కూడా.. ఇక్కడే రూ.5 భోజనమే చేశారు. పేదవారి కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించి వెళ్లిపోతే.. చంద్రబాబును ఎవరూ ఏమీ ప్రశ్నించరు . కానీ, తానే స్వయంగాసతీసమేతంగా భోజనం చేసి.. తాను పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారు.
ఇక్కడే మరో కీలక విషయం కూడా ఉంది. ఆటోకార్మికులు, పారిశుద్ధ కార్మికులకు కూడా చంద్రబాబు దంపతులు స్వయంగా భోజనాలు వడ్డించడమే కాకుండా.. వారిపక్కనే నిలబడి.. వారితో ముచ్చటిస్తూ.. భోజనం చేశారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కానీ, ఇలాంటి అవకాశం జగన్ ఎప్పుడూ తీసుకోలేదు. ఏనాడూ పేదలతో కలిసి గుక్కెడు మంచినీరు కూడా తాగలేదు. ఈ పరిణామాలను చూసిన వారు.. ఎవరు పెత్తందారులో చంద్రబాబు చెప్పకనే చెప్పారని అంటున్నారు.