దసరాకు పూర్తి సినిమా అంటున్న బాబు
సెప్టెంబర్ 1 నుంచి ఏకంగా నలభై అయిదు రోజుల పాటు ప్రజలలో ఉండాలని బాబు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 31 Aug 2023 4:11 PM GMTచంద్రబాబు ఈసారి ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. అందుకోసం ఆయన గతానికి భిన్నంగా అనేక రకాలైన కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సమాజంలోకి వివిధ వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో బాబు ఉన్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకం అన్న సంగతి చంద్రబాబు కంటే ఎవరికీ ఎక్కువగా తెలియదు అన్నది వాస్తవం.
అందుకే చంద్రబాబు 2024 ఎన్నికలలో విజయమే టార్గెట్ గా విగరస్ గా జనంలో తిరుగుతున్నారు. తానే కాదు టీడీపీ తమ్ముళ్లకు ఆయన లక్ష్యాలను నిర్దేశించి జనంలోకి పంపుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఏకంగా నలభై అయిదు రోజుల పాటు ప్రజలలో ఉండాలని బాబు భావిస్తున్నారు. ఆయన ఏపీ అంతటా ఈ నెలన్నర రోజులూ విస్తృతంగా పర్యటిస్తారు.
అదే టైంలో పార్టీ కార్యకర్తలకు మ్యానిఫేస్టో చేతికి ఇచ్చి ప్రజల వద్దకు పంపుతున్నారు. ఇప్పటికే రాజమండ్రి మహానాడులో టీడీపీ మినీ మేనిఫేస్టోను రిలీజ్ చేసింది. అందులో మహిళలు, యువత కోసం సంక్షేమ పధకాలను చంద్రబాబు పొందుపరచారు. వాటిని జనంలోకి ఎంత బాగా వీలైతే అంతలా తీసుకుని పోవాలని ఆయన ఆదేశిస్తున్నారు. ప్రజల మధ్యన మ్యానిఫేస్టో పెట్టి చర్చినాలని ఆయన కోరుతున్నారు
వారి నుంచి సలహా సూచనలు తీసుకున్న మీదట దసరా నాటికి పూర్తి మ్యానిఫేస్టో రిలీజ్ చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. ఈ మ్యానిఫేస్టో ఏపీలో ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు తాజాగా ప్రకటించిన ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా మూడు కోట్ల మందిని కేవలం నలభై అయిదు రోజులలో కలుసుకోవాలని భావిస్తున్నారు.
ఈ కొత్త ప్రోగ్రాం లో చంద్రబాబు సైతం పల్లెలలో తిరుగుతారు అని అంతున్నారు. పల్లె నిద్ర కూడా చేయాలని ప్రజలతోనే ఉంటూ వారు బాగోగులు స్వయంగా చూస్తూ వారితో రచ్చబండ వేదికలుగా అన్ని విషయాలు మాట్లాడాలని బాబు భావిస్తున్నారు. ఇలా అయిదు కోట్ల మంది ప్రజానీకంలో మూడు కోట్ల మందిని నేరుగా టీడీపీ కలుసుకుంటే వారిలో తమ పార్టీ పట్ల తమ మ్యానిఫేస్టో పట్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగితే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అన్నది బాబు మార్క్ మాస్టర్ ప్లాన్.
ఇక తెలుగుదేశం ఎన్నికల గుర్తు సైకిల్ ని కూడా ఏపీలో తమ ప్రభుత్వం వస్తే ఏమిటి చేస్తుంది అని చెప్పడానికి వాడుకుంటున్నారు. సైకిల్ కి ఒక చక్రం సంక్షేమం అయితే రెండవ చక్రం అభివృద్ధి అని బాబు అంటున్నారు. ఈ రెండు చక్రాలు సక్రమంగా తిరగాలీ అంటే జనాలు టీడీపీని ఎంచుకోవాలని వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరుతున్నారు. మొత్తానికి తగ్గేదిలే అంటూ బాబు సెప్టెంబర్ 1 నుంచి జనం మధ్యకు రానున్నారు. ఈసారి దసరాకు పూర్తి సినిమా చూపిస్తాను అంటున్నరు. సో వెయిట్ అండ్ సీ.