ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్న బాబు...ఈసారి తేల్చుడే...!?
ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న నేపధ్యం నుంచి చూసినపుడు బాబు ఢిల్లీ టూర్ కి ఎంతో ప్రాముఖ్యత ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 31 Dec 2023 7:46 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారని తెలుస్తోంది. జనవరి రెండవ వారంలో చంద్రబాబు హస్తిన ప్రయాణం పెట్టుకున్నారు. ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న నేపధ్యం నుంచి చూసినపుడు బాబు ఢిల్లీ టూర్ కి ఎంతో ప్రాముఖ్యత ఉందని అంటున్నారు.
చంద్రబాబు ఈసారి ఢిల్లీ టూర్ వెనక చాలా ఉద్దేశ్యాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో మూడవసారి కూడా బీజేపీ అధికారంలోకి రావచ్చు అని సర్వేలు చెబుతున్నాయి. మోడీ హ్యాట్రిక్ ప్రధాని అవుతారు అని అంటున్నారు. దాంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ఎలక్షనీరింగ్ తో పాటు ఎన్నికలలో ఎత్తులు పై ఎత్తులు చాలా ఈజీగా సక్సెస్ అవుతాయని అంటున్నారు.
ఇక కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా ఏపీ వంటి రాష్ట్రంలో తెలుగుదేశం గెలిస్తే కేంద్ర సహకారం అవసరం అన్న భావన కూడా ఉంది. దాంతో చంద్రబాబు బీజేపీ వైపు మొగ్గుతున్నారు అని అంటున్నారు. బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చి అయినా పొత్తు కలుపుకోవాలని చూస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నారు. ఆయన ద్వారా కూడా పొత్తు రాయబారాలు సాగుతున్నాయని అంటున్నారు.
బీజేపీతో పొత్తు అన్నది తేలిపోతే ఏపీలో విపక్ష శిబిరంలో ఫుల్ క్లారిటీ వస్తుంది. అంతే కాదు తెలుగుదేశం తన అభ్యర్ధులను కూడా ప్రకటించే చాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు అని అంటున్నారు. ఆయన తెలుగుదేశంతో పొత్తు విషయం ఒక కొలిక్కి తీసుకుని వస్తారు అని అంటున్నారు.
అదే విధంగా బీజేపీ మదిలో ఏముందో తెలుసుకుంటారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆలోచనలను కూడా బీజేపీకి చేరవేస్తారు అని అంటున్నారు. అలా పవన్ ఢిల్లీ వెళ్ళి వచ్చాక బీజేపీ శిబిరం ఏపీ రాజకీయాల మీద ఏమనుకుంటోంది అన్నది ఒక స్పష్టత వచ్చాక చంద్రబాబు జనవరి రెండవ వారంలో ఢిల్లీకి వెళ్తారని అంటున్నారు.
ఈ టూర్ లో ఆయన అమిత్ షా తో పాటు ఇతర బీజేపీ పెద్దలను కూడా కలుస్తారు అని అంటున్నారు. కుదిరితే ఈసారి ప్రధాని మోడీతో కూడా బాబు భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తిని రేపుతోంది. ఈసారి బీజేపీతో టీడీపీ పొత్తులు కుదిరితే మాత్రం 2014 సీన్ ఏపీలో రిపీట్ అవడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.