Begin typing your search above and press return to search.

ఏపీ ఎజెండా ఫిక్స్ చేస్తున్న జగన్!

సాధారణంగా విపక్షం ఏ అంశం మీద చర్చ జరగాలని కోరుకుంటుందో.. ఆ విషయాలకు భిన్నంగా చర్చకు తెర తీయటం కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   27 July 2024 7:10 AM GMT
ఏపీ ఎజెండా ఫిక్స్ చేస్తున్న జగన్!
X

ఏపీ అసెంబ్లీకి రావట్లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు ఏపీ అధికార పక్ష నేతలు. అయితే.. తాను అసెంబ్లీకి వెళ్లకున్నా.. ఏపీ అసెంబ్లీలో దేనిపైన చర్చ జరగాలన్న ఎజెండాను ఫిక్స్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. గడిచిన కొద్దిరోజులుగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ తో పాటు.. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి చేపట్టిన నిరసన కార్యక్రమాల గురించి తెలిసిందే.

సాధారణంగా విపక్షం ఏ అంశం మీద చర్చ జరగాలని కోరుకుంటుందో.. ఆ విషయాలకు భిన్నంగా చర్చకు తెర తీయటం కనిపిస్తుంది. అయితే.. సభకు రాని జగన్.. తాను సభలో లేకున్నా.. సదరు సభలో ఏయే అంశాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నారో.. ఆ అంశాలే చర్చకు వచ్చేలా చేయటం చూసినప్పుడు.. అసెంబ్లీకి వెళ్లకుండానే ఏపీ ఎజెండాను ఫిక్స్ చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఉదంతంపై అందరి చూపు పడేలా చేయటమే కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపేలా చేపట్టిన కార్యక్రమం ఒక ఎత్తు అయితే.. ఏపీలో గడిచిన యాభై రోజుల్లో 36 హత్యలు జరిగినట్లుగా చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. ఏపీలో ఏం జరుగుతుందన్న విషయాన్ని అందరూ మాట్లాడుకునేలా చేయటంలో జగన్ సక్సెస్ అయ్యారు. చివరకు ప్రభుత్వం సైతం ఆత్మరక్షణలో పడి.. ఏపీ శాంతిభద్రతలపై ప్రకటనలు ఇవ్వటంతో పాటు.. గత ప్రభుత్వం చేసిన తప్పులు అంటూ కొత్త కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి.

హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందుతున్న వైనంపై విమర్శలు గురి పెట్టిన వైసీపీ అధినేత తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటూ డ్యామేజ్ కంట్రోల్ ప్రోగ్రాంకు తెర తీయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సర్కారు ఇచ్చిన ప్రజంటేషన్ లో దొర్లిన తప్పులను వెంటనే ఎత్తి చూపటమే కాదు.. ఆ విషయంలోనూ ప్రభుత్వం ఇరుకున పడేలా చేశారు.

ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే.. సూపర్ సిక్స్ అమలు చేస్తామన్న చంద్రబాబు మాటలపై ఎదురుదాడిని మొదలు పెట్టిన వైసీపీ నేతల తీరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతోంది. మొత్తంగా ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఇష్టపడని అధికారపక్షానికి.. అసలుసిసలు విపక్షనేత పాత్రను పోషిస్తూ.. ఏపీ ఎజెండాను ఫిక్స్ చేస్తున్నక్రెడిట్ ను సొంతం చేసుకుంటున్నారు.