ఇండియా కూటమిలోకి బాబు : రెడ్ కార్పెట్ పరచిన కామ్రెడ్...!
ఇండియా కూటమిలోకి చంద్రబాబు చేరితే ఏపీలో చంద్రబాబు కూటమిలోకి చాలా ఈజీగా కమ్యూనిస్టులు చేరిపోవచ్చు.
By: Tupaki Desk | 23 Dec 2023 12:44 PM GMTటీడీపీ అధినేత మనసులో ఏమి ఉంది అన్నది తెలియదు కానీ ఆయనకు ఏపీలో అనుకూలంగా ఉన్న కమ్యూనిస్టులు మత్రం కాషాయం పార్టీతో మైత్రి వద్దు ఇండియా కూటమిలోకి వచ్చేయమని తెగ పోరుతూనే ఉన్నారు. ఇండియా కూటమిలోకి చంద్రబాబు చేరితే ఏపీలో చంద్రబాబు కూటమిలోకి చాలా ఈజీగా కమ్యూనిస్టులు చేరిపోవచ్చు.
ఎందుకంటే ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారు. దాతో బాబుకు వారు పదే పదే అదే చెబుతున్నారు. ఈ విషయంలో సీపీఐ ముందుంది. తెలంగాణాలో సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఒక సీటు సాధించి అసెంబ్లీలోకి ప్రవేశించింది. అలా అక్కడ ఇండియా కూటమి సెట్ అయింది. ఏపీలో చూస్తే ఇంకా అలాంటి రాజకీయ వాతావరణం అయితే ఏర్పడలేదు.
కానీ దాన్ని తీసుకురావడానికి కామ్రేడ్స్ తాపత్రయపడుతున్నారు. కమ్యూనిస్టులకు బీజేపీకి మధ్య జన్మ విరోధం. అది ఒక కీలక అంశం అయితే ఇపుడు ఏపీ రాజకీయాల్లో కూడా వారికి అవసరాలు ఉన్నాయి. దాంతో బాబు మా వైపే రావాలని అంటున్నారు. ఇండియా కూటమిలోకి చంద్రబాబు రావాలని కోరుతూ రెడ్ కార్పెట్ నే పరచారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
అంతే కాదు ఏపీలో కూటమి కట్టాల్సిన పార్టీల లిస్ట్ కూడా చదివేశారు. ఏపీలో టీడీపీ జనసేన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలసి ముందుకు వెళ్లాలని నారాయణ సూచించడం విశేషం. ఏపీలో పార్టీలు అన్నీ కూడా బీజేపీని చూసి భయపడుతున్నాయని నారాయణ అనడం విశేషం. అయితే అలాగని బీజేపీతో కలసి వెళ్లే పార్టీలకు జనాలు ఓట్లు వేయరని ఆయన జోస్యం చెప్పారు.
నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే ఏమవుతుందో అని అంతా ఆలోచిస్తున్నారు కానీ దాని విడవాలని ఆయన కోరుతున్నారు. ప్రత్యేకించి టీడీపీకి ఆయన స్వాగతం పలుకుతూ ఇండియా కూటమిలో చేరమని సలహా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలోకి నిజంగా టీడీపీ చేరుతుందా టీడీపీ అడుగులు ఏ వైపు అన్న చర్చ వస్తోంది.
ఎందుకంటే టీడీపీ విషయంలో బీజేపీ ఈ రోజుకీ ఏమీ తేల్చలేదు, ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయా అన్నది ప్రశ్నగానే ఉంది. ఇక తెలంగాణాలో చూస్తే టీడీపీ అక్కడ పోటీ చేయకుండా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది అని ప్రచారం ఉండనే ఉంది. పైగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వెళ్లిన వారే.
దాంతో పాటు టీడీపీకి కాంగ్రెస్ కొత్త కాదు. ఆ పార్టీతో 2018లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. అందువల్ల ఇండియా కూటమిలోకి టీడీపీ వెళ్లడాన్ని ఎవరూ ఆశ్చర్యంగా చూడరు. ఏపీ విషయానికి వస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అన్న భావన కూడా చాలా మంది తమ్ముళ్ళలో ఉంది అని అంటున్నారు. తెలంగాణా విజయంతో ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎంతో కొంత పెరిగి ఉంటుందని లెక్క వేస్తున్నారు.
అలాగే ఈ రోజుకీ కాంగ్రెస్ నాయకులు కొందరు ఏపీలో కీలకంగా ఉన్నారు. దాంతో పాటు వామపక్షలతో జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో కొత్త రాజకీయ వంటకంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆదరిస్తారు అన్న మాట ఉంది. మొత్తానికి చూస్తే నారాయణ సలహాను టీడీపీ సీరియస్ గానే పరిశీలిస్తుంది అని అంటున్నారు.