బాబు ఈజ్ రిటర్న్!
తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే విషయంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు.
By: Tupaki Desk | 1 Jun 2024 11:30 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 22 రోజుల తర్వాత తిరిగి ఏపీకి వచ్చారు. గత నెల 13న ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఆయన తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక, ఆ తర్వాత.. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. అయితే.. కుటుంబంతో కలిసి విదేశీపర్యటన ముగించుకుని వచ్చాక కూడా.. ఏపీకి రాలేదు. నాలుగు రోజుల పాటు ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే విషయంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకునే పనిలో ఉన్నారు.
ఇక, తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితానికి సంబంధించి పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మెజారిటీ సంస్థలు ఏపీ లో ఎన్డీయే కూటమి(టీడీపీ-బీజేపీ-జనసేన) విజయం దక్కించుకుంటుందని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. పార్లమెంటు స్థానాల్లోనూ కూటమి మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందని వెల్లడించాయి. అయితే.. అదేసమయంలో మరికొన్ని సంస్థలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపాయి. ఏది ఎలా ఉన్నా.. కూటమి విజయం ఖరారవుతుందని.. పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. దీనికి అనుకూలంగానే మెజారిటీ సంస్థలు సర్వే రిపోర్టులు ఇచ్చాయి.
ప్రధానంగా జాతీయ మీడియా సంస్థలు, సర్వేలుకూడా.. కూటమికి అనుకూలంగా సీట్లు ఇవ్వడంతో సహజంగానే టీడీపీలో సంతోషం వెల్లివిరిసింది. ఈ అంచనాలు వస్తున్న సమయంలోనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలు దేరి విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. అనంతరం.. ఆయన ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. కాగా, జూన్ 2న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి కూడా ఈ సమావేశానికి రానున్నట్టు తెలిసింది.