రేవంత్ రెడ్డి దెబ్బకు చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారా ?
ఏపీలో ఏదైనా కొత్త కార్యక్రమం తీసుకుంటే తెలంగాణాలో అది ఎందుకు లేదు అని అడుగుతారు.
By: Tupaki Desk | 15 Aug 2024 1:30 PM GMTరెండు తెలుగు రాష్ట్రాలు. ప్రతీ విషయంలోనూ పోలిక ఉంటుంది. అది విభజన జరిగిన తరువాత గత పదేళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న విషయమే. తెలంగాణాలో ఏదైనా అభివృద్ధి జరిగితే ఏపీలో ఏమి జరుగుతోంది అని చూస్తారు. ఏపీలో ఏదైనా కొత్త కార్యక్రమం తీసుకుంటే తెలంగాణాలో అది ఎందుకు లేదు అని అడుగుతారు. ఇల రెండు తెలుగు రాష్ట్రాలలో పోలిక అన్నది పెడుతూనే ఉంటారు.
గతంలో కేసీఆర్ చంద్రబాబు, అలాగే కేసీఆర్ జగన్, రేవంత్ రెడ్డి జగన్ అంటూ పోలిక చూసేవారు. ఇపుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య అలాంటిది మొదలైంది. నిజానికి చూస్తే చంద్రబాబుకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన అభివృద్ధి చేస్తారు అని కంపెనీలను తీసుకుని వస్తారని పెట్టుబడులు పెద్ద ఎత్తున తాను పాలించే స్టేట్ కి తెస్తారు అని ఆ విధంగా ఉద్యోగాలు సృష్టిస్తారు అని కూడా ఇమేజ్ ఉంది.
ఇక ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయాక 2014లో తొలి సీఎం గా ఏపీకి చంద్రబాబు అయ్యారు. కానీ ఆయన బ్రాండ్ ఇమేజ్ ఆ అయిదేళ్ల కాలంలో ఎక్కడా పెద్దగా పని చేయలేదు అని చెబుతారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి దాని చుట్టూ అభివృద్ధి అని కొంత చేశారు కానీ అయితే బాబు ఆశించినంత అభివృద్ధి అన్నది జరగలేదు అన్నది జనాలలో కూడా ఉంది.
ఇక చంద్రబాబు తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతి రాజధానిని కోల్డ్ స్టోరేజ్ లోనే పడేశారు అన్న విమర్శలు మూటగట్టుకున్నారు. జగన్ సీఎం గా ఉనపుడు విశాఖ రాజధాని అని చెప్పి పెద్దగా అక్కడ కూడా ఏమీ అభివృద్ధి చూపించలేకపోయారు. మొత్తం మీద చూస్తే విభజన ఏపీలో గత పదేళ్లలో ఇద్దరు సీఎంలు మారారు కానీ ఇద్దరూ ఏమీ అభివృద్ధి చేయలేకపోయారు అన్నది అంతా అనుకునే మాట.
అయితే ఏపీలో మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపధ్యంలో తెలంగాణ తో పోటీ పడి అభివృద్ధి చేయాలని ఏపీ పాలకులు అనుకుంటున్నా అది ఏ మాత్రం సాధ్యం అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు అని అంటున్నారు. ఎందుకు అంటే తెలంగాణాలో యంగ్ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన చాలా స్మార్ట్ గా తన వర్క్ తాను చేసుకుంటూ పోతున్నారు
ఆయన పెద్ద ఎత్తున పెట్టుబడులను తెలంగాణాకు ఆహ్వానిస్తున్నారు. ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్లు కూడా రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇక సీఎం అయిన తరువాత తాజాగా రేవంత్ రెడ్డి అమెరికా సౌత్ కొరియా దేశాల పర్యటన చేశారు. అక్కడ తెలంగాణా గురించి ఆయన కొన్ని ప్రజంటేషన్లు ఇచ్చి వచ్చారు. దాంతో పెట్టుబడులకు తెలంగాణాలో అవకాశాలు మరింత విస్తృతం అయ్యాయి.
ఇదిలా ఉంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ అన్నది తెలిసిందే. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్ గురించి చెప్పినా ఆయన ప్రయత్నాలకు హైదరాబాద్ సిటీ పూర్తి సపొర్టు గా ఉంటుంది. దాంతో ఆయన టాస్క్ ఈజీ కూడా అవుతుంది అని అంటున్నారు. హైదరాబాద్ అంటే ఐటీ సిటీ ఫార్మా సిటీ అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ఎన్నో ఉన్నాయి. ఇలా హైదరాబాద్ లో ఏమి లేవు అనే డౌట్ వస్తుంది. చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ లో ఎన్నో కనిపిస్తాయి. హైదరాబాద్ లో అన్నీ దొరుకుతాయని కూడా చెప్పాలి.
ఇక తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య రీజనల్ రింగ్ రోడ్డుకి శ్రీకారం చుట్టారు. అంతే కాదు ఫ్యూచర్ సిటీ అని హైదరాబాద్ పేరు చెప్పి ఇన్వెస్టర్లను ఆయన బాగానే ఆకట్టుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయంగా అనుభవశాలి. ఆయనకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ తో ఆయన ఏపీకి సీఎం అయిన తరువాత అన్ని ఏపీకి తరలిపోతాయని అంతా అనుకున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఏపీకి పరుగులు తీస్తుందని కూడా భావించారు.
కానీ రేవంత్ రెడ్డి చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరింత జాగ్రత్త పడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని వాడుకుంటూ ఇన్వెస్ట్మెంట్లు ఇంకా ఎక్కువగా తెలంగాణాకు వచ్చేలా చేస్తున్నారు. అమరావతికి ఏవీ తరలిపోకుండా రేవంత్ సీఎం గా చేస్తున్న కార్యక్రమాలు వేస్తున్న ఎత్తులు అన్నీ కూడా తెలంగాణాకు ఎంతో మేలు చేస్తున్నాయి. ఒక విధంగా ఏపీకి ఏమీ పోకుండా రేవంత్ రెడ్డి బాగానే అడ్డుకుంటున్నారు అని అంటున్నారు.
చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డి ధాటిని తట్టుకోలేకపోతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించాల్సిందే అని అంటున్నారు. నా దగ్గర హైదరాబాద్ ఉంది. మాకు పక్క రాష్ట్రాలు పోటీ కాదు అంటూ రేవంత్ రెడ్డి బోల్డ్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ని చూస్తే చాలు ఆయన నిబ్బరం ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ బాలారిష్టాలతోనే ఇంకా ఉంది. ఈ అయిదేళ్ళూ చంద్రబాబు ఎంతో శ్రమ పెడితే తప్ప ఏపీ ఒక స్థాయికి రాలేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. దాంతో తెలంగాణాతో ఈ సమయంలో ఏపీ అసలు పోల్చుకోవాల్సిన పరిస్థితి కానీ పని కానీ లేనే లేదని అంటున్నారు.