Begin typing your search above and press return to search.

మారిన బాబు.. మారని ఉత్కంఠ.. జాబితా లేట్ ఎందుకు?

పద్నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉండి.. మరో ఐదేళ్లు అధికారాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి తనను తాను మారిన మనిషిగా చెప్పుకోవటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Jun 2024 4:08 AM GMT
మారిన బాబు.. మారని ఉత్కంఠ.. జాబితా లేట్ ఎందుకు?
X

పద్నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉండి.. మరో ఐదేళ్లు అధికారాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి తనను తాను మారిన మనిషిగా చెప్పుకోవటం తెలిసిందే. అందుకు తగ్గట్లే ఇప్పటికే పలు అంశాల్లో తన మార్పును కొట్టొచ్చినట్లు చూపిస్తున్నారు. అయితే.. ఇంగువ కట్టిన వస్త్రానికి వాసన అంత త్వరగా పోదన్న చందంగా.. కొన్ని అంశాల్లో బాబు ఇంకా మారలేదంటూ ఆయనపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు కొందరు. మంత్రివర్గం కూర్పు మీద చివరి నిమిషం వరకు సస్పెన్స్ ఎందుకు?నరాలు తెగేలా ఉత్కంఠ ఏల? అంటూ బాబు మీద ఫైర్ అవుతున్న బ్యాచ్ కాస్తంత పెద్దదే.

ఐదేళ్లు విపక్షంలో ఉండి.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వారం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు.. ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేయించాల్సిన అవసరం ఏముంది? అంటూ ప్రశ్నల వర్షం బాబు మీద కురుస్తుంది. పండ్లున్న చెట్టుకే దెబ్బలన్న చందంగా.. విషయం ఏదైనా చంద్రబాబును ఇట్టే మాట అనేసే ధోరణి రెండు తెలుగు రాజకీయాల్లో కామనే అని చెప్పాలి. నిజానికి ఈసారి మంత్రుల జాబితాను చంద్రబాబు ఎప్పుడో సిద్ధం చేశారు. ఆయన తాను చేసే ప్రతి పని మీదా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అయినప్పటికీ.. ఆలస్యం కావటానికి కారణం చంద్రబాబు కాదు. కూటమిలో భాగమైన బీజేపీ అగ్రనాయకత్వానిదే ఈ ఆలస్యమంతా.

మంత్రివర్గాన్ని సిద్ధం చేసినప్పటికి.. కూటమి ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ పెద్ద అమిత్ షాలు విజయవాడ చేరుకునేసరికి ఆలస్యం కావటం.. వారు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ వారి మధ్య మంత్రివర్గం ఎంపిక మీద చర్చ జరిగింది. దీనికి సంబంధించిన కసరత్తు.. తన ఆలోచనల్ని చంద్రబాబు షేర్ చేసుకున్నారు. సుదీర్ఘంగా సాగిన చర్చలు ముగిసిన తర్వాత మంత్రివర్గం జాబితాను అర్థరాత్రి ఒంటి గంటన్నర వేళలో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో ఆలస్యమంతా అమిత్ షా.. నడ్డాలదనే చెప్పాలి. మొత్తంగా బాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని మాత్రం చెప్పక తప్పదు.