Begin typing your search above and press return to search.

బాబూ మోహన్ కొడుకు బీయారెస్ లోకి... బీజేపీకి బిగ్ షాక్ !

ప్రముఖ సినీ నటుడు మాజీ మంత్రి ఆందోల్ బీజేపీ అభ్యర్ధి అయిన బాబూమోహన్ కి సరిగ్గా ఎన్నికల ముంగిట బిగ్ షాక్ తగిలింది

By:  Tupaki Desk   |   19 Nov 2023 6:35 AM GMT
బాబూ మోహన్  కొడుకు  బీయారెస్ లోకి... బీజేపీకి బిగ్ షాక్ !
X

ప్రముఖ సినీ నటుడు మాజీ మంత్రి ఆందోల్ బీజేపీ అభ్యర్ధి అయిన బాబూమోహన్ కి సరిగ్గా ఎన్నికల ముంగిట బిగ్ షాక్ తగిలింది. అది కూడా ఆయన ఇంట్లో నుంచే. సొంత కుమారుడే బీజేపీకి తండ్రికి ఎదురు నిలిచాడు. బాబూ మోహన్ తనయుడు ఉదయ్ బాబు కుమార్ బీజేపీకి రాజీనామా చేశారు.

ఆయన అధికార బీయారెస్ లో చేరనున్నారు అని ప్రచారం సాగుతోంది. అంటే బాబుమోహన్ గెలుపు కోసం కాకుండా ఆయన ప్రత్యర్ధి గెలుపు కోసం కుడుకే ప్రయత్నిస్తారు అన్న మాట. ఇదిలా ఉంటే బీజేపీలో తనకు టికెట్ కోసం ఉదయ్ బాబు కుమార్ గట్టిగా ప్రయత్నం చేశారు.

కానీ టికెట్ ఆయనకు దక్కలేదు. ఆ మాటకు వస్తే బాబూ మోహన్ కే మొదటి జాబితాలో టికెట్ దక్కలేదు. ఇక బాబూ మోహన్ దీని మీద అప్పట్లోనే మీడియా ముందుకు వచ్చి మరీ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తాను పోటీ చేయబోవడం లేదని కూడా ప్రకటించారు.

కానీ చిత్రంగా బాబూ మోహన్ కి తరువాత జాబితాలో టికెట్ కేటాయించారు. అయితే తనకు టికెట్ ఇవ్వకుండా తండ్రికి ఇవ్వడం మీద ఉదయ్ మండిపోయారని కూడా అంటున్నారు. నిజానికి కొడుకుకు టికెట్ ఇస్తే తాను ప్రచారానికి పరిమితం కావాలని బాబూ మోహన్ కూడా ఆలోచించారుట.

కానీ అలా జరగలేదు. బాబూ మోహన్ కే టికెట్ బీజేపీ ఇచ్చింది. ఎందుకంటే ఆయన మాజీ మంత్రి సీనియర్ నేత, సినీ గ్లామర్ కూడా కలసి వస్తుందని కమలనాధులు అంచనా వేసి మరీ టికెట్ ఇచ్చారు. దాంతో బీజేపీ నుంచి బాబూ మోహన్ పోటీకి దిగాల్సి వచ్చింది.

అయితే తన తండ్రికే టికెట్ దక్కింది కదా అని కుమారుడు ఉదయ్ మనసు విశాలం చేసుకుని ప్రచారం చేయాల్సింది. కానీ అలా కాకుండా అతను బీయారెస్ లోకి జంప్ కావడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. రాజకీయాలు తండ్రీ కొడుకుల మధ్యన కూడా చిచ్చు పెడతాయనడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు

అయితే ఉదయ్ తన ఫ్యూచర్ చూసుకునే ఇలా చేశారు అని అంటున్న వారూ ఉన్నారు. బాబూ మోహన్ గెలుపునకు ఎంతవరకూ ఆందోల్ లో అవకాశాలు ఉన్నాయో తెలియదు దాంతో ఈసారితో ఎన్నికల రాజకీయాలకు బాబూ మోహన్ కూడా గుడ్ బై చెప్పాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయ్ బీయారెస్ లోకి వెళ్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా తండ్రి కి ప్రచారం చేసి ఆ మీదట గెలుపోటములు చూసుకుని ఉదయ్ పార్టీ మారాల్సింది అన్న వారూ ఉన్నారు.

కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఇదేమీ విశేషంకాదు కానీ బీజేపీ ఆకులు ఆసలు తెలంగాణాలో ఒక్కో రేకు వీడి వాడిపోయినట్లుగా వెనక్కి పోతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ షాక్ నుంచి బీజేపీ బాబూ మోహన్ ఎలా బయటకు వస్తారో.