బాబు పవన్ నాన్ లోకల్స్...జగన్ మార్క్ పంచ్
వారు ఎక్కడో ఉంటూ ఏపీ సీఎం ఎక్కడ ఉండాలో డిసైడ్ చేస్తారుట అని జగన్ శ్రీకాకుళం సభలో నిప్పులు చెరిగారు.
By: Tupaki Desk | 14 Dec 2023 10:15 AM GMTచంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీకి నాన్ లోకల్స్ అంటూ ఏపీ సీఎం జగన్ డిక్లేర్ చేసేశారు. అసలు వారికి ఏపీతో ఏమి పని అంటూ ప్రశ్నించారు. వారు ఎక్కడో ఉంటూ ఏపీ సీఎం ఎక్కడ ఉండాలో డిసైడ్ చేస్తారుట అని జగన్ శ్రీకాకుళం సభలో నిప్పులు చెరిగారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏమి చేసినా వీరికి ఏడుపే ఏడుపు అంటూ జగన్ విమర్శించారు. మరీ ముఖ్యంగా పేద ప్రజలకు ఏపీ ప్రభుత్వం మంచి చేస్తూంటే చూసి ఓర్వలేక ఏడుస్తున్నారు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
వీరు ఏపీకి అవతల నివాసం ఉంటూ ఏపీ ప్రభుత్వం తాము చెప్పినట్లే నడవాలని చెప్పడమేంటని జగన్ గుస్సా అయ్యారు. ఈ ఇద్దరి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా జగన్ హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం ఏలాంటి వివక్ష లేకుండా లంచాలే లేకుండా నేరుగా ప్రజల ఖాతాలలోకి డబ్బు జమ చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఆ విధంగా నగదు అక్క చెల్లెమ్మల ఖాతాలలోకి వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇలా పేదలకు సంక్షేమం అందుతూంటే పవన్ కి చంద్రబాబుకు ఏడుపు తప్ప మరోటి రావడంలేదు అని జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్నికలు వస్తే చాలు పొత్తులు ఎత్తులు జిత్తులు బయటకు తీస్తారు. వాటి మీదనే ఆయన పూర్తిగా ఆధారపడతారు అని జగన్ ఎద్దేవా చేశారు.
ఏపీకి చంద్రబాబు చేసింది లేదని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్రాలో కిండ్నీ వ్యాధుల సమస్య ఉంటే ప్రాణాలు పోతూంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి అసలు పట్టించుకోలేదని జగన్ నిందించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదని అన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పం నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్రా మీద ప్రేమ ఏమి ఉంటుందని జగన్ ఫైర్ అయ్యారు.
ఉత్తరాంధ్రాలోని విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు అని జగన్ బాబు మీద మండిపడ్డారు. బాబుతో పాటు ఆయన అనుంగు శిష్యులు కూడా మోకాలడ్డే కార్యక్రమం చేస్తున్నారు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు ఉండేది ఏపీలోనే కాదు, కానీ వీరు ఏపీ రాజకీయాలను తాము చెప్పినట్లుగా చేయాలని అంటారు, ఇదెక్కడి న్యాయం అని జగన్ ప్రజల సమక్షంలోనే బాబు పవన్ లను గట్టిగా ఎండగట్టారు.
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కి తాగు నీరు ఇవ్వలేదు, నేను సీఎం అయ్యాకనే నీరు అందింది అని జగన్ గుర్తు చేశారు. ఆయనకు మమకారం మానవత్వం అన్నది లేదు అని హాట్ కామెంట్స్ చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రి నాలుగున్నర దశాబ్దాల రాజకీయం చేసినా ప్రజలకు చెప్పుకోవడానికి ఒక్క మంచి పని లేనేలేదని ఎద్దేవా చేశారు. తన వల్ల ఒక పధకం వచ్చింది అని చంద్రబాబు చెప్పడానికి కూడా లేదని అన్నారు.
మాట ఇస్తే నిలబడే నైజం కూడా బాబుకు అసలు లేదని అన్నారు. బాబు ఏ విషయంలోనూ మాట మీద నిలబడిన చరిత్ర లేదని నిందించారు. ఎన్నికలు వస్తే చాలు ప్రజల మీద కాదు కుయుక్తుల మీద ఆధారపడతారు అని నిందించారు. దత్తపుత్రుడు మీద కూడా బాబు ఆధారపడతారు. దత్తపుత్రుడు అనే యాక్టర్ ని ముందు పెట్టి డ్రామాలు ఆడతాడు అని అన్నారు. ఈ ఇద్దరి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నారు జగన్.