Begin typing your search above and press return to search.

బాబు మొదటి బటన్ నొక్కుడు ఖరీదు పది వేల కోట్లు!

అలాగే నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇవ్వాలి.

By:  Tupaki Desk   |   17 Jun 2024 4:13 AM GMT
బాబు మొదటి బటన్ నొక్కుడు ఖరీదు పది వేల కోట్లు!
X

బటన్ నొక్కుడు అన్నది ఏపీ రాజకీయాల్లో ఇపుడు అనివార్యం అయింది. అయిదేళ్ల క్రితం వైసీపీ వచ్చిన తరువాత వివిధ పధకాల పేరుతో బటన్ నొక్కుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాంతో వైసీపీ సంక్షేమం కంటే రెట్టింపు అని టీడీపీ ఎన్నికల్లో హామీలు గుప్పించి పవర్ ని అందుకుంది. ఇక జూలై నెలలో పాత బకాయిలు కలుపుకుని మరీ ఏకంగా ఏడు వేల రూపాయలు సామాజిక పెన్షన్లు వృద్ధులకు ఇవ్వాలి. అలాగే నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇవ్వాలి.

ఇలా పదహారు కేటగిరీలకు సామాజిక పెన్షన్లు భారీ పెంపుతో ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం ఖర్చు ఎంతో తెలుసా. అక్షరాలా నాలుగు వేల అయిదు వందల కోట్ల రూపాయలు అన్న మాట. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు చెల్లించాల్సిన మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలు. జూలై నెల ఎంతో దూరంలో లేదు. మరో పదమూడు రోజులలో జూలై 1వ తేదీ వచ్చేస్తోంది.

ఈ రెండు ఖర్చులు ఇపుడు ప్రభుత్వానికి తప్పనిసరి. అంటే ఏకంగా 10,500 కోట్ల రూపాయలు తక్షణం ఖర్చు చేయాల్సిన అవసరం టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని అంటున్నారు. వీటితో పాటు సూపర్ సిక్స్ అనే భారీ హామీల మూట ఉండనే ఉంది. అందులో రైతులకు ఏటేటా భరోసా కింద 20 వేల రూపాయలు ఇవ్వాలి. విద్యా సంవత్సరం మొదలైంది కాబట్టి తల్లికి వందనం పధకం కింద పాఠశాలకు వెళ్ళే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు ఇవ్వాలి.

ఇక 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న ప్రతీ మహిళకూ నెలకు 1500 రూపాయలు వారి ఖాతాలో ఆర్ధిక సాయం ఇవ్వాల్సి ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణం ఎటూ ఉండనే ఉంది. వంటింటి గ్యాస్ మహిళలకు సెంటిమెంట్. అలా గ్యాస్ బండ ఒకటి అయినా ఇవ్వాలి.అది మార్కెట్ లో 900 వందలు ఉంది. దానిని ఫ్రీ గా అంటే ఆ మొత్తాన్ని సబ్సిడీగా ప్రభుత్వమే భరించి ఇవ్వాలి. ఇలా కోట్లలోనే గ్యాస్ బండ స్కీమ్ అమలు చేయాల్సి ఉంది. దీని ఖర్చు కూడా అంచనా కడితే నాలుగు వేల కోట్ల రూపాయలు దాకా ఉండొచ్చు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో తక్షణం సంపద అయితే సృష్టించబడదనే అంటున్నారు. అదే టైం లో ఆదాయ మార్గాలు కూడా ఏపీకి పెద్దగా లేవు. గత ప్రభుత్వం అప్పులు తెచ్చి పధకాల పేరిట పంచేసింది. వాటి అప్పులు అలా కొండలా ఉన్నాయి. వడ్డీలు కూడా కట్టాల్సి ఉంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు కొత్త అప్పులు పుట్టేది కూడా లేదనే అంటున్నారు. ప్రభుత్వం గాడిన పడి ఆదాయాలు పెరగడానికి కచ్చితంగా రెండేళ్ళకు పైగా సమయం పడుతుంది అని అంటున్నారు.

ఈ ఉచిత హామీల గుదిబండను తగిలించుకున్నందుకు రెండేళ్ల పాటు ప్రభుత్వానికి తీరని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఉద్యోగులకు జీతాలు ఒకటవ తేదీనే ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న చర్చ మొదలైంది. ఏపీలో ఈ ఆర్థిక సంక్షోభం చాలా లోతులను చూసేసిన నేపధ్యంలో కూటమి వైపు ఆశగా చూసే వారు అంతా ఉన్నారు. మరి ఇది చంద్రబాబు దీక్షా దక్షతలకు అసలైన పరీక్షా సమయం అని అంటున్నారు.