Begin typing your search above and press return to search.

ఎట్టెట్టా...బాబు రిటర్న్ గిఫ్టా.....బీయారెస్సే గెలిచిందిగా...!

ఈ జనం అంతా కలసి కాంగ్రెస్ కి ఓటు వేస్తారని అనుకున్నారు. కానీ హైదరాబాద్ లో మొత్తం 24 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు

By:  Tupaki Desk   |   4 Dec 2023 1:30 PM GMT
ఎట్టెట్టా...బాబు రిటర్న్ గిఫ్టా.....బీయారెస్సే గెలిచిందిగా...!
X

చంద్రబాబు అరెస్ట్ తో పెద్ద ఎత్తున సానుభూతి ఉప్పొంగింది అని అది వరదలా మరి ఒక బలమైన సామాజిక వర్గం కాంగ్రెస్ కి ఓటేసి బీయారెస్ ని ఓడిస్తుంది అని నెల రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద బయటకు వస్తే హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఇంటి దాకా జనమే జనం కనిపించారు.

ఈ జనం అంతా కలసి కాంగ్రెస్ కి ఓటు వేస్తారని అనుకున్నారు. కానీ హైదరాబాద్ లో మొత్తం 24 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. బీయారెస్ కి 16 సీట్లు వస్తే మజ్లీస్ కి ఏడు, బీజేపీకి ఒకటి దక్కాయి. అంతదాకా ఎందుకు కమ్మ వారు ఎక్కువగా ఉన్నారని చెప్పే కూకట్ పల్లిలో కూడా బీయారెస్ సిట్టింగ్ అభ్యర్దికి ఏకంగా 64 వేల పై చిలుకు మెజారిటీ దక్కింది.

మరి బాబు అరెస్ట్ పట్ల సానుభూతి కనుక వెల్లువలా ఉంటే కాంగ్రెస్ కి భాగ్యనగరంలో కనీసంగా కూడా ఒక్క సీటు అయినా ఎందుకు రాలేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం చంద్రబాబు మహిమతోనే తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచింది అని అంటున్నారు. ఆ విధంగా కేసీయార్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని కూడా ప్రచారం చేస్తున్నారు.

దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీకి అనుకూల మీడియాకు గట్టిగానే కౌంటరేశారు.కేసీయార్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా స్వీయ సంతృప్తి పొందుతోంది. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు గారు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసేశారా? అక్కడి ప్రజలకు ఈయనొక మర్చిపోయిన జ్ఞాపకం. గెలుపునకు ఈయన కారణమవుతారా? నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలని అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ కౌంటర్ వేశారు.

దీంతో ఇపుడు బాబు అరెస్ట్ సెంటిమెంట్ ఎంతవరకూ తెలంగాణాలో పండింది అన్న చర్చ సాగుతోంది. అదే విధంగా లాజిక్ పాయింట్ చూస్తే కనుక గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎందుకు బోణీ కొట్టలేదు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. దీంతో చంద్రబాబు ఇంతకీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా లేదా అన్నది ఒక డిబేట్ గా మారింది

సరే కానీ గిఫ్టులు రిటర్న్ గిఫ్టులు రాజకీయాల్లో మామూలే. తనకు నిజంగా రిటర్న్ గిఫ్ట్ అందింది అనుకుంటే అపర చాణక్యుడు కేసీయార్ చూస్తూ ఊరుకుంటారా. తనను 2018 ఎన్నికల్లో ఓడించబోయారన్న దాని మీదనే చంద్రబాబుని ఏపీలో పనిగట్టుకుని ఓడించారు. ఇపుడు కేసీయార్ మాజీ అయ్యారు. దాంతో రెట్టించిన పట్టుదలతో ఏపీలో పనిచేసి మరీ బాబు ఓటమికి కృషి చేయరా అన్న చర్చ కూడా వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.