Begin typing your search above and press return to search.

సూపర్ సిక్స్ ఇంక కష్టమేనా ?

అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీల విషయంలో అయితే సందిగ్ధత సందేహాలు అనేకం కలుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 July 2024 11:24 AM GMT
సూపర్ సిక్స్ ఇంక కష్టమేనా ?
X

ఏపీలో సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని గట్టిగా ఒకటికి పదిసార్లు చెప్పింది. ముఖ్యంగా మహిళలను, రైతులను యువతను టార్గెట్ చేసుకుని పలు హామీలను టీడీపీ కూటమి గుప్పించింది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీల విషయంలో అయితే సందిగ్ధత సందేహాలు అనేకం కలుగుతున్నాయి.

వాటికి తెర దించేలా అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిండు అసెంబ్లీలో సూపర్ సిక్స్ హామీల విషయంలో ఆవేదన ఉందని అన్నారు. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే భయం కలుగుతోందని ఆయన అన్నారు. దాంతో పాటు ప్రజలు అన్ని విషయాలూ అర్ధం చేసుకోవాలని ఒక విన్నపం చేశారు.

దాంతో సూపర్ సిక్స్ హామీల విషయంలో కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి అన్నది క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. ఏపీలో ఆర్ధిక పరిస్థితి బాగా లేనందువల్ల సూపర్ సిక్స్ హామీల విషయంలో ఆవేదన తప్ప ఆచరణ ఇప్పట్లో ఉండదనే సందేశాన్ని పరోక్షంగా చంద్రబాబు ప్రజలకు పంపించారు అని అంటున్నారు.

సూపర్ సిక్స్ హామీల మీద మంత్రులు అయితే త్వరలో అమలు చేస్తామని ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. ఇలా ఎంతకాలమని అన్నట్లుగా చంద్రబాబు ఈ అయోమయానికి గందరగోళానికి తెర దించే ప్రయత్నం చేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. నిజానికి సూపర్ సిక్స్ పధకాలు అమలు చేయాలీ అంటే రాష్ట్ర ఖజానా సరిపోదు. అప్పుల కుప్పలు అవుతాయి.

అన్ని పధకాలూ ఠంచనుగా అమలు చేస్తే కనుక అదనంగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు ఏటా అవుతాయని అంటున్నారు. ఏపీలో బడ్జెట్ చూస్తే ఏ మాత్రం సహకరించే పరిస్థితి లేదు అన్నది తెలుస్తుంది. దాంతో ఆదిలోనే అసలు వాస్తవాలు చెబితే బాగుంటుంది అన్నట్టుగా చంద్రబాబు ముందే నిజం చెప్పారని అంటున్నారు.

అయితే ఈ విషయంలో చంద్రబాబు కాస్తా నిజాయతీ ప్రదర్శించినా ఆయన ఏమీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేత కాదు, ఇపుడు నాలుగవ సారి ఆయన ఏపీకి సీఎం గా ఉన్నారు. దానికంటే ముందు ఆయన మూడు సార్లు సీఎం గా చేశారు. మరి బాబుకు ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి తెలియదా అన్న చర్చ వస్తోంది.

ఆయన అన్నీ తెలిసే ఈ హామీలు ఇచ్చారు కాబట్టి అమలు చేయాల్సిందే అని కూడా అంటున్న వారూ ఉన్నారు. ఈ రోజునే రాష్ట్ర పరిస్థితి బాగా లేదు అన్నది బాబుకు తెలిసి వచ్చిందా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. ఆర్ధిక పరిస్థితి బాగు లేదని బాబుకు 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రిగా చేసినపుడే తెలుసు కదా అన్న చర్చ కూడా వస్తోంది.

బాబు 2014లో విభజన ఏపీకి తొలిసారి సీఎం అయినపుడే లక్ష్ల కోట్ల అప్పుతో ఏపీ ఖజానా దక్కింది. దాని మీద బాబు అయిదేళ్ళ కాలంలో చేసిన అప్పు ఉంది. ఆ తరువాత వచ్చిన వైసీపీ కూడా అప్పులు చేసింది. ఇక 2024లో బాబు గద్దెనెక్కేనాటికి ఏపీకి అప్పులు కాక సౌభాగ్యం ఎలా ఉంటుందని ఊహించారు అన్నదే చర్చగా ఉంది.

మరో వైపు చూస్తే చంద్రబాబు ఏపీలో సంపద సృష్టించి ఇస్తామని అందరికీ సంక్షేమ పధకాలు అమలు చేస్తామని ఎన్నికల వేళ చెప్పారు. కానీ సంపద సృష్టించడం అన్నది ఒక్క రోజులో జరిగేది కాదు, అప్పటివరకూ పధకాలు ఆపడం అంటే హామీల భంగమే అని అంటున్నారు. ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి సహకరించాలి అని బాబు కోరుతున్నారు

అయితే ఏపీ ప్రజలు ఇపుడు ఏమి అర్థం చేసుకుంటారు, ఏ విధంగా సహకరిస్తారు అన్నది తెలియదు. వారు అయిదేళ్ల పాటు ఏమీ చేయలేరు. వారు అన్నీ జాగ్రత్తగా గమనిస్తారు. కాంగ్రెస్ కి కేవలం ఆరు నెలల వ్యవధిలోనే తెలంగాణాలో కొంత వ్యతిరేకత వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. అలా చూస్తే కనుక ఏపీలో కూడా ప్రజలు చంద్రబాబుని అర్థం చేసుకున్నారా లేక వ్యతిరేకిస్తారా అన్నది తేలాలంటే ఏవో ఎన్నికలు రావాల్సిందే.

మరో వైపు చూస్తే ఎక్కడా ప్రజలు తమ ప్రయోజనాల విషయంలో తగ్గి ప్రభుత్వాలకు సహకరించేది ఉండదు, తల తాకట్టు పెట్టి అయినా తమకు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరతారు. రాజకీయంగా తలపండిన చంద్రబాబుకు ఇవన్నీ తెలియనివి కావు. మరి ఆయన జస్ట్ జనరల్ గా పబ్లిక్ కి అప్పీల్ చేసి వారి సహకారం కోసం చూస్తారా లేక కొంతకాలం ఆగి అయినా ఇచ్చిన మాట ప్రకారం పధకాలను అమలు చేస్తారా అన్నది చూడాల్సిందే. ఏది ఏమైనా ఏపీలో పధకాల కోసమే ఓటు వేసిన ఓటర్లు అత్యధికం. ఈ విషయం ఎవరూ మరచిపోకూడదు అన్న విశ్లేషణలు ఉన్నాయి.