బాబు కుట్రలో చివరి అస్త్రం ఆమె...!
ఆమె ఎవరో కాదు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కుట్రలో చిట్ట చివరి అస్త్రం. ఇంతకీ ఆమె ఎవరు అంటే వైఎస్ షర్మిల.
By: Tupaki Desk | 21 Jan 2024 8:02 PM GMTఆమె ఎవరో కాదు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కుట్రలో చిట్ట చివరి అస్త్రం. ఇంతకీ ఆమె ఎవరు అంటే వైఎస్ షర్మిల. ఇదీ వైసీపీ కాంగ్రెస్ ఏపీ కొత్త ప్రెసిడెంట్ షర్మిల మీద చేస్తున్న ఘాటు విమర్శ. షర్మిల ఎవరో కాదు టీడీపీ కూటమిలో ఆమె కూడా ఇండైరెక్ట్ గా చేరిన ఒక మిత్రురాలు అన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ.
వైఎస్ షర్మిల మాటలు ఆమె ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నాక చేసిన ఆరోపణలు అన్నీ పాతవే. పైగా టీడీపీ ఎన్నో సార్లు జగన్ మీద అలాంటి ఆరోపణలు సంధించినదే. దాంతో షర్మిల నోట పలుకుతున్నది టీడీపీ విమర్శలే. పలికించేది చంద్రబాబు అనే వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి అంటున్నారు.
వైఎస్ కుమార్తెగా వైఎస్ జగన్ సోదరిగా షర్మిలకు ఎపుడూ గౌరవం ఇస్తాం, కానీ పీసీసీ చీఫ్ గా మాత్రం ఆమె ప్రతీ విమర్శకు ప్రతి విమర్శ చేస్తాం అన్నది సజ్జల చెప్పిన వైసీపీ మాట. అంటే షర్మిల విషయంలో రాజకీయంగా ఎలాంటి సంకోచం లేకుండా విమర్శలు చేయడానికి వైసీపీ ప్రిపేర్ అయిపోయింది అన్న మాట.
నిజమే ఇది రాజకీయ రణ క్షేత్రం. అక్కడ దాకా వస్తే ఎవరి ప్రయోజనాలను వారు కాపాడుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బందులో పడతారు. అందువల్ల షర్మిలని ఏ రకంగానూ స్పేర్ చేయరని అర్ధం అవుతోంది. అందుకే తెలంగాణాను వదిలేసి షర్మిల ఏపీకి ఎందుకు వచ్చారు అని సజ్జల సూటిగా ప్రశ్నించారు. ఒకనాడు కాంగ్రెస్ ని తిట్టి ఇపుడు ఆ పార్టీ కిరీటం పెట్టుకున్నాక మంచి అయిపోయిందా అని ఆయన అడుగుతున్నారు.
వైఎస్సార్ కుటుంబాన్ని ప్రత్యేకించి వైఎస్ జగన్ని కాంగ్రెస్ ఎన్ని బాధలు పెట్టిందో చూసి కూడా షర్మిల జగన్ మీద విమర్శలు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ లో చేరాక ఆమె యాస భాష రెండూ మారిపోయాయని సజ్జల అంటున్నారు.
జగన్ మీద కాంగ్రెస్ అక్రమ కేసులు నమోదు చేసింది అని చెప్పినది ఎవరో కాదు ఒకనాడు కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న గులాబ్ నబీ అజాద్ అని సజ్జల గుర్తు చేశారు. చనిపోయిన వైఎస్సార్ పేరుని కాంగ్రెస్ పార్టీ ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసింది అని సజ్జల ఫైర్ అయ్యారు.
తెలంగాణా రూట్ లో పాలిటిక్స్ చేసుకుంటున్న వైఎస్ షర్మిల ఏపీకి వచ్చింది ఎవరి ప్రయోజనాల కోసమో అని ఆయన ప్రశ్నించారు. ఆమె ఎవరి ఆయుధమో కూడా అన్నది ఇంకా బాగా ప్రజలకు తెలుసు అని అన్నారు. తెలంగాణా పార్టీని అర్జంటుగా మూసేసి ఏపీకి ఎందుకు వచ్చారు. అక్కడ కూడా కాంగ్రెస్ ఉంది కదా మరి కాంగ్రెస్ లో చేరి అక్కడ రాజకీయం చేయకుండా ఏపీకి ఆమె ఎందుకు వచ్చారు. దీని వెనక ఏముందని సజ్జల ప్రశ్నలు సంధించారు.
మొత్తానికి చూస్తే షర్మిల వైరి పక్షంలో చేరిన బాణంగానే ఆయన ముద్ర వేశారు. ఒకనాటి జగనన్న బాణం ఇపుడు విపక్షం నుంచి ఎదురు రావడం వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు సజ్జల మాట్లాడారు అంటే అది వైసీపీ అధినాయకత్వం మాటలుగానే అంతా భావిస్తారు. మరి షర్మిల ఊరుకుంటారా. దీనికి ఆమె జవాబు కచ్చితంగా చెబుతారు అని అంటున్నారు. తొందరలోనే ఆమె నుంచి కౌంటర్లు రావడం ఖాయమని అంటున్నారు