Begin typing your search above and press return to search.

బాబూ... గోదావరి పుష్కరాలు గుర్తున్నాయా ?

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయం మారింది.

By:  Tupaki Desk   |   23 Aug 2024 12:30 AM GMT
బాబూ... గోదావరి పుష్కరాలు గుర్తున్నాయా ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటనకు వచ్చారు. అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయం మారింది. విశాఖలో జరిగింది దారుణ మారణ హోమం. హృదయాలు ద్రవించే దృశ్యాలు కనిపించాయి.

ఒక శరీరంలోని వేరు వేరు భాగాలు వేరు వేరు చోటకు ఎగిరిపడి ఏది ఎవరిదో గుర్తు పట్టలేనంతగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగింది అన్నది వాస్తవం. ఆ మీదట ఏ విధంగా చర్యలు చేపట్టాలన్నది ప్రభుత్వాలు చేయాల్సిన పని.

విశాఖ వెళ్ళిన చంద్రబాబు గత ప్రభుత్వం నిర్వాకమే ఇదంతా అని ఎదురు దాడి చేశారని వైసీపీ మండిపోతోంది. గత అయిదేళ్లలో వైసీపీ హయాంలో సెజ్ లలో సంభవించిన మరణాలు ఇవీ అని బాబు లెక్కలు చెప్పారు. వ్యవస్థలు అయిదేళ్ళలో గాడి తప్పాయని పాత పాటనే పాడారు.

సెజ్ లో కనీస భద్రత లేదు అన్నది అంతా ఎలుగెత్తి చాటుతున్న వైనం. అక్కడ వందలాది మంది పనిచేస్తూంటే ఒకే ఒక్క అగ్ని మాపక యంత్రం ఉంది. భద్రతను గాలిలోకి వదిలేసి సెజ్ లు పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అధికారులు వారే ఉంటున్నారు. దాంతో సెజ్ ల నిర్వాహకులు మామూళ్ళతో మామూలు వ్యవహారంగానే అంతా నడిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తప్పు చేసిన వారిని ఒకరిని అయినా కటకటాల వెనక్కి పంపిస్తే మిగిలిన వారికి అది గుణపాఠం అవుతుంది. మరి అందుకు ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయా అన్నదే ప్రశ్న. సెజ్ ల వెనక పెద్దలు విదేశాలలో ఉంటారు. మరో వైపు పెట్టుబడుల కోసం దేనికైనా రెడీ అని రెడ్ కార్పెట్ పరుస్తున్న దైన్యంలో రాజకీయ పాలనా నాయకత్వం ఉంది అన్న విమర్శలు ఉన్నాయి.

ఇలా ఏ విధంగా చూసినా ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా ఉంది. అదృష్టం బాగుంటే ఉద్యోగానికి వెళ్ళిన వాడు తిరిగి ఇంటికి వస్తాడు. లేకపోతే లేదు అన్నట్లుగానే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలు చేసుకుంటూ పొద్దు పుచ్చడం కంటే అంతా ఒక్కటిగా నిలిచి సరైన కార్యాచరణను రూపొందించవలసిన అవసరం ఉంది అని అంటున్నారు.

అయితే ఏ ప్రమాదం జరిగినా ఏ ఇబ్బంది వచ్చినా మీది తప్పు అంటే మీది అని విమర్శించుకుని అసలైన వారిని వదిలేయడం ఏపీలో రాజకీయ జీవులకు అలవాటు అయింది అని అంటున్నారు. చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలోనే మరణాలు ప్రమాదాలు అని లిస్ట్ చదివితే దానికి మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు.

పాపం చంద్రబాబు హయాంలో ప్రమాదాలే జరగలేదుట అని ఎద్దేవా చేశారు. కానీ ఇదే అచ్యుతాపురం సెజ్ లో బాబు ఏలుబడిలో కూడా ముగ్గురు ప్రమాదంలో చనిపోయారు అని గుర్తు చేశారు. అంతే కాదు గోదావరి పుషకరాలలో ఏకంగా 29 మంది మృత్యు వాత పడిన సంగతి మరిచిపోయావా బాబూ అని కూడా నిలదీశారు. మొత్తానికి ప్రమాదాలలో మరణించేది సాధారణ ప్రజలు బతుకు జీవులు బక్క జీవులు రాజకీయ పార్టీలు మాత్రం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతే ప్రమాదాలను అరికట్టడం ఎపుడూ అన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి.