బాబు వర్సెస్ జగన్ : మేనిఫెస్టో కాదు...అదే గేమ్ చేంజర్ ?
దాంతో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ కూటమి బ్రహ్మాండమైన అంశంతో జనాల్లోకి వచ్చింది.
By: Tupaki Desk | 4 May 2024 11:30 PM GMTమ్యానిఫేస్టోలు పోటీలు పడి దించారు. సంక్షేమాన్ని నిండుగా కుమ్మరించారు. ఉచిత పధకాలు వేలం పాట కంటే ఎక్కువగా పాడుతూ పెద్ద నంబర్లే వేసి జనాల ముందుంచారు. కానీ ఓటరు వాటి మీద ఎలా రియాక్ట్ అయ్యారో కానీ పెద్దగా మాత్రం మైలేజ్ ఎవరికీ రాలేదు. దాంతో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ కూటమి బ్రహ్మాండమైన అంశంతో జనాల్లోకి వచ్చింది.
గత కొన్ని రోజులుగా ఏపీని హడలెత్తించే విధంగా ఒక అంశం పట్టుకుంది. అదే వైరల్ గా తిరుగుతోంది. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ దాకా దాని మీదనే మాట్లాడుతున్నారు. టీడీపీ అనుకూల పత్రికలలో దాని మీదనే వార్తలు వండి వారుస్తున్నారు. ఇంతకీ ఆ అంశం ఏమిటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ఏపీలో ఇంకా ఆమోదం పొందలేదు. కానీ ఇది జగన్ ప్రభుత్వం మీద విపక్షాలు తీవ్ర విమర్శలు కురిపించే అంశంగా మారుతోంది.
మీ భూమి మీది కాదు అని విపక్ష నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఆఖరుకు వైసీపీ నేతల ఆస్తులు కూడా కొల్లగొట్టెలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని అంటున్నారు. మీ భూమి మీద జగన్ బొమ్మ అంటే కచ్చితంగా ఆ భూమి జగన్ కే పోతుంది తప్ప మీది కాదని చెబుతున్నారు. అంతే కాదు రిజిష్టర్ ఆఫీసులో జిరాక్స్ కాపీలు ఇచ్చి మీ భూమి అసలు ఆధారాలు అన్నీ ప్రభుత్వం వద్దనే ఉంచుతున్నారని దీని వల్ల పేదలు రైతులు భూములు పూర్తిగా పోగొట్టుకుంటారని అంటున్నారు.
యాజమాన్య హక్కులు కూడా పోతాయని భయపెడుతున్నారు. మొదట్లో దీన్ని వైసీపీ పట్టించుకోలేదు. కానీ ఇది కాక పుట్టిస్తోంది. పైగా ఫోన్ల ద్వారా ఒక సందేశాన్ని అయిదు కోట్ల ఆంధ్రులకు చేర వేస్తున్నారు. దాంతో ఒక రకమైన అలజడి అయితే చెలరేగుతోంది. దీంతో వైసీపీ ఆలస్యంగా మేలుకుంది.
ఈ అంశం మీద మాట్లాడాల్సిన కీలక మంత్రులు పెద్దగా రియాక్ట్ కావడం లేదు. దాంతో ముఖ్యమంత్రి జగన్ ఈ అంశం మీద గట్టిగా నోరు చేసుకోవాల్సి వచ్చింది. ఇది గొప్ప సంస్కరణ అన్నారు. ఆయన హిందూపురం సభలో మాట్లాడుతూ వందేళ్ళ క్రితం నాటి భూ రికార్డులను రీ సర్వే చేయిస్తున్నామని చెప్పారు.
భూ వివాదాలు లేకుండా కోర్టులకు పోకుండా ప్రభుత్వం మీ భూమికి మీ యాజమాన్య హక్కులకు గ్యారంటీగా ఉంటూ చేస్తున్న గొప్ప కార్యక్రమం అని చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వం చేస్తూంటే దీని మీద విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఏపీలో 17 వేలకు పైగా రెవిన్యూ గ్రామాలు ఉన్నాయని ఇప్పటికే రీ సర్వే జరిగింది కేవలం ఆరు వేల గ్రామాలలో మాత్రమే అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా మరో రెండేళ్ళు కొనసాగుతుందని ప్రజాభిప్రాయం కోరుతామని దాని ప్రకారమే ఈ యాక్ట్ పనిచేస్తుంది అన్నారు.
ప్రజల భూములను ఎవరూ కబ్జా చేయకుండా ఈ యాక్ట్ రూపొందించామని ఆయన చెప్పుకున్నారు. విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని నమ్మవద్దు అని జగన్ కోరారు. భూములు ఇచ్చే జగన్ భూములు ఎలా తీసుకుంటారు అని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు దుమ్మెత్తి పోస్తుండడం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్టం రావడం భూ కబ్జాలు చేసే వారికి ఇష్టం ఉండదని అన్నారు. ఇది భూములను రక్షించే చట్టం అయితే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని విమర్శించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని, ఇది ఇంకా అమల్లోకి రాలేదని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పుడున్న చట్టంతో ల్యాండ్ గ్రాబింగ్ కు అవకాశం ఉండేదని, సీఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో కాజేశారని, మళ్లీ అలాంటి అరాచకాలు రావాలని టీడీపీ కోరుకుంటోందని అన్నారు. ఇలాంటి వాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విమర్శిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.
ఈ యాక్ట్ మీద మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రియాక్ట్ అయ్యారు. అవినీతికి తావులేకుండా దళారులు, లిటిగెంట్లకు ఎక్కడా అవకాశం లేకుండా ఉండాలని చట్టం తెస్తున్నామని చెప్పారు. వ్యవస్థలో మార్పులు చేర్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని కూడా అన్నారు. ఇదంతా అందులో భాగంగానే జరుగుతోందని పేర్కొంది. ప్రస్తుతం కోర్టులో ఉంది. పబ్లిక్ హియరింగ్ రావాలి. అప్పుడు కానీ చట్టంగా మారదు అని బొత్స స్పష్టత ఇచ్చారు.
ఇక భూమి అంటే ఎవరికైనా సెంటిమెంట్. అది బలమైన ఎమోషన్. దాంతో టీడీపీ కూటమి కరెక్ట్ టైంలో ఇది పట్టుకుంది. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కేంద్రమే తెచ్చింది. దాంతో బీజేపీ ఈ విషయంలో ఏమీ మాట్లాడంలేదు. కానీ అదే బీజేపీ కూటమిలో ఉన్నా టీడీపీ జనసేన బలంగా వైసీపీని కార్నర్ చేస్తున్నారు. ఏపీలో ఇది వాడి వేడిగా చర్చకు తావిస్తోంది.
ఇది కనుక బర్నింగ్ టాపిక్ అయితే మాత్రం వైసీపీకి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఈ చట్టం మీద గత కొన్ని రోజులుగా విపక్షాలు విరుచుకుపడుతున్నా వైసీపీ సరిగ్గా రియాక్ట్ కాకపోవడంతో ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. దాంతో జగన్ దానికి సరైన కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో కూడా సీఎం జగన్ కౌంటర్ ఇస్తూ ఈ ఇష్యూని దాని వేడిని చల్లార్చే ప్రయత్నం చేయకపోతే ఇబ్బందే అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఈ ఇష్యూ గేమ్ చేంజర్ అవుతుందా అన్న చర్చ కూడా వస్తోంది.