డొక్కా సీతమ్మ...పుణ్యం పవన్ దేనమ్మా !
మనం మరచిపోయిన మహానుభావులను ఈ తరంలో గుర్తు చేస్తున్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారూ అంటే అది కచ్చితంగా పవన్ కళ్యాణే అని చెప్పాలి.
By: Tupaki Desk | 16 Aug 2024 3:37 AM GMTఇదంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే అని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివారు అని ప్రత్యర్ధులు ఎకసెక్కం చేయవచ్చు కాక. కానీ ఆయన చదివిన పుస్తకాలు ఆయన నేర్చుకున్న విజ్ఞానం ఆయన జనంలో ఎపుడూ పెడుతూ వస్తున్నారు. మనం మరచిపోయిన మహానుభావులను ఈ తరంలో గుర్తు చేస్తున్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారూ అంటే అది కచ్చితంగా పవన్ కళ్యాణే అని చెప్పాలి.
లేకపోతే డొక్కా సీతమ్మ పేరు ఎంతమందికి తెలుసు. పాత తరం వారికి పాఠ్యపుస్తకంలో అయినా ఆమె గురించిన పాఠం ఉండేది. ఇప్పటి చదువులలో ఆమె పేరూ ఊసూ రెండూ లేవు. అయినా పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తన ప్రసంగాల ద్వారా ఆమె పేరు జనంలో ఉంచారు. గోదావరి జిల్లాలకు చెందిన ఆమె అన్న దాతగా పేరు గడించారు.
పవన్ టీడీపీ కూటమిలో ఉన్నారు కాబట్టే ఆమె పేరు మధ్యాహ్న భోజన పధకానికి పెట్టడం జరిగింది. అయితే పవన్ మొదట కోరింది అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి అయినా ఆమె పేరు పెట్టమని. ఆ తరువాత ఆయనే వద్దు అనేసుకున్నారు. ఏదో ఒక పధకానికి పెట్టారు కదా అని కూడా పవన్ వెనక్కి తగ్గారు.
అయితే అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెడితే సముచితం అన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన సందర్భంగా డొక్కా సీతమ్మ పేరుని పదే పదే తలచుకున్నారు.
ఆమె చేసిన సేవలను మరచిపోలేమని కూడా బాబు అన్నారు. అన్న దానం అంటే దేశంలోనే ఆమె పేరు అందరికీ గుర్తుకు వస్తుందని అన్నారు. బాబు ఇంతలా ఆమె గురించి చెబుతున్నారు కాబట్టి మరిన్ని కొత్త క్యాంటీన్ల ఏర్పాటులో అయినా ఆమె పేరు పెడితే ఆమె చేసిన సేవలకు సార్ధకత చేకూరుతుందని అంటున్నారు ఇక చంద్రబాబు తెచ్చిన అన్నా క్యాంటీన్ల పధకం చాలా మంచిది. ఈ రోజుకీ పేదలు చాలా మంది దేశంలో ఉన్నారు. వారి ఆకలి తీర్చేందుకు ఈ పధకం బాబు తెచ్చారు.
అందుకు ఆయన్ని అభినందించాలి. ఈ సందర్భంగా బాబు మరో మాట అన్నారు ఈ పథకం శాశ్వతంగా కొనసాగాలని. అంటే రేపటి రోజున టీడీపీ కాకుండా మరే పార్టీ అధికారంలోకి వచ్చినా అన్న మాట.మరి అలా జరగాలీ అంటే ఈ పధకానికి పార్టీ ముద్ర రాజకీయ నీడలు లేకుండా చూసుకోవాలి. డొక్కా సీతమ్మ లాంటి వారి పేరుని పెట్టాలి.
నిజానికి పవన్ కోరింది కూడా అదే. మహనీయుల పేర్లు పెడితే ఆ పధకాలను తీసేయడానికి ఎవరికీ మనసు అంగీకరించదు. జనాలు కూడా ఊరుకోరు. టీడీపీ వైసీపీ చేస్తున్న తప్పులు ఏంటి అంటే తమ రాజకీయ ముద్ర కోసం తపన పడడం. తమ పార్టీ నేతల పేర్లు పెట్టుకోవడం.
సరే అన్నా క్యాంటీన్ల విషయంలో ఎన్టీఆర్ పేరు పెట్టడంలోనూ ఔచిత్యం ఉంది. అయితే రానున్న క్యాంటీన్లలో కొన్నింటికి అయినా డొక్కా సీతమ్మ పేరు పెడితే ఈ పథకం ఎల్లకాలం నిలుస్తుంది. అంతే కాదు మహనీయులకు నివాళి అర్పించినట్లు అవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరింత చొరవ చూపాలని అంతా కోరుతున్నారు.