Begin typing your search above and press return to search.

సీఎంగా చంద్రబాబు మొదటి మూడు సంతకాలు వీటిపైనే!

అలాగే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సూచించిన కొన్ని హామీలను కూడా వీటికి జత చేశారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 6:26 AM GMT
సీఎంగా చంద్రబాబు మొదటి మూడు సంతకాలు వీటిపైనే!
X

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక కుదేలైంది. కూటమి తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీలను చంద్రబాబు ఇచ్చారు. అలాగే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సూచించిన కొన్ని హామీలను కూడా వీటికి జత చేశారు. వీటన్నింటిని కొత్త ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు జూన్‌ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే మొదటగా వేటిపైన సంతకాలు చేస్తారనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. చంద్రబాబు మొదట మెగా డీఎస్సీపైన సంతకం చేస్తారని తెలుస్తోంది. ఆయన కూడా ఎన్నికల ముందు ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు.

వాస్తవానికి ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీ ప్రభుత్వం డీఎస్పీని ప్రకటించింది. అయితే కేవలం 6200 పోస్టులకే ప్రకటన ఇచ్చింది. అయితే ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్‌ తో దానికి బ్రేక్‌ పడింది. యువత పెద్ద ఎత్తున ఎన్నికల్లో కూటమికి జైకొట్టడంతో వారిని సంతృప్తిపర్చాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై పడింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీని పెడతారని తెలుస్తోంది. మెగా డీఎస్సీ పేరుకు తగ్గట్టే భారీగా టీచర్‌ ఉద్యోగాల నియామకాలకు ప్రకటన ఇస్తారని తెలుస్తోంది.

ఇక చంద్రబాబు సీఎంగా తన రెండో సంతకాన్ని ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపైన చేస్తారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు వారికి చెందకుండా పోతాయని ఉధృత ప్రచారం చేశారు. వైసీపీ ఘోర ఓటమిలో ఈ అంశం కూడా ప్రధాన పాత్ర పోషించిందనే అంచనాలు ఉన్నాయి. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు రెండో సంతకం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపైన ఉంటుందని సమాచారం.

ఇక మూడోది పెన్షన్ల పెంపు. టీడీపీ కూటమి అధికారంలో రావడంలో ఈ అంశం కూడా కీలక పాత్ర పోషించింది. తాము అధికారంలోకి వస్తే రూ.4000 పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది కూడా ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌ నుంచి పెంచిన పెన్షన్‌ తో జూలై 1న రూ.7 వేల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

గతంలో చంద్రబాబు హయాంలో రూ.2 వేలుగా ఉన్న పింఛన్‌ ను జగన్‌ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.250 చొప్పున పెంచి మూడు వేల రూపాయలకు పెంచారు. ఈ ఏడాది జనవరిలో పింఛన్‌ 3 వేల రూపాయలు అయ్యింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రూ.4 వేలు ఇవ్వనుంది. జూలై 1న పింఛన్‌ లబ్ధిదారులు రూ.7 వేలు (ఏప్రిల్, మే, జూన్‌ లకు రూ.1000 చొప్పున, జూలైకి 4000) అందుకోనున్నారు. ఇలా మొత్తం మూడు ప్రధాన హామీలను చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అమల్లోకి తెస్తారని తెలుస్తోంది.