Begin typing your search above and press return to search.

బాబు గెలుపు సీక్రెట్ చెప్పిన జగన్...!

ఈ మూడు సార్లు చంద్రబాబు సీఎం అయ్యారు అంటే అది బాబు ఘనత గొప్పతనం అని టీడీపీ ప్రచారం చేస్తుంది.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:46 PM GMT
బాబు గెలుపు సీక్రెట్ చెప్పిన జగన్...!
X

ఏపీలో మూడు సార్లు చంద్రబాబు సీఎం గా పనిచేశారు. అందులో రెండు సార్లు ఉమ్మడి ఏపీలో చేస్తే విభజన ఏపీలో తొలి సీఎం గా ఆయన 2014లో బాధ్యతలు చేపట్టారు. ఈ మూడు సార్లు చంద్రబాబు సీఎం అయ్యారు అంటే అది బాబు ఘనత గొప్పతనం అని టీడీపీ ప్రచారం చేస్తుంది. చంద్రబాబుని గెలుపు వీరుడిగా కూడా అభివర్ణిస్తుంది.

అయితే చంద్రబాబులో గెలిపించే నైజం లేదని, ఆయన సమర్ధత దక్షత చూసి జనాలు ఎపుడూ గెలిపించలేదని వైసీపీ నేతలు తరచూ చెబుతూ ఉంటారు. చంద్రబాబు స్వయం ప్రకాశితమైన నేత కారని కూడా అంటూంటారు. ఇపుడు అదే మాటను ముఖ్యమంత్రి జగన్ కూడా అనడమే విశేషం. మాట్లాడితే చాలు టీడీపీ తమ్ముళ్ళు చంద్రబాబు ముమ్మారు సీఎం అంటారు. అసలు చంద్రబాబు ఎలా గెలిచారు ఆయన గెలుపు వెనక సీక్రెట్ ఏంటి అన్న దాన్ని నూజివీడులో జరిగిన సభలో జగన్ జనాలకు చక్కగా వివరించారు.

చంద్రబాబు తొలిసారి సీఎం అయింది ప్రజలు ఓటేస్తే గెలిచి కాదని తన సొంత మామ ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుని వెన్నుపోటుతో సీఎం అయ్యారని జగన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని మరోమారు జనం కళ్ల ముందుంచారు. ఇక 1999లో చంద్రబాబు అప్పట్లో దేశవ్యాప్తంగా పెల్లుబుకిన కార్గిల్ వార్ ద్వారా వచ్చిన ఎమోషనల్ ఫీలింగ్స్ ఒడిసి పట్టుకుని రెండవమారు సీఎం అయ్యారని చెప్పుకొచారు.

మూడవమారు సీఎం అయింది కూడా ప్రజలకు అలవి కానీ హామీలు ఇచ్చి ఏపీని ఇంద్ర లోకం చేస్తాను అంటూ మభ్యపెట్టి మాత్రమే తప్ప జనాలు మెచ్చి ఏ మాత్రం కానే కాదని అంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గాలి తీసేశారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత తాను ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను గాలికి వదిలేశారని, మహిళలను, విద్యార్ధులను నిరుద్యోగ యువతను, రైతులను అవ్వా తాతలను మోసం చేశారని జగన్ విమర్శించారు.

అందుకే గూబ గుయ్యిమనేలా 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు జనాలు తీర్పు ఇచ్చి 23 సీట్లకు పరిమితం చేసారని జగన్ అన్నారు. ఈ దెబ్బకు రీ సౌండ్ వచ్చి తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని జగన్ పదే పదే గుర్తు చేస్తున్నారు. ఈ మధ్యన ఆయన జిల్లా టూర్లలో ఆ తీర్పుని జనాల ముందు పెడుతున్నారు.

ఏ హామీ నెరవేర్చని చంద్రబాబుని ఓటు వేయడం దండుగ అనే నాడు అలాంటి తీర్పు ఇచ్చారని ఆయన విమర్శిస్తున్నారు. అంటే దాని అర్ధమేంటి అంటే 2024లో కూడా చంద్రబాబు ఎన్నో హామీలతో ముందుకు వచ్చినా ఏ ఒక్కటీ నెరవేర్చరు కాబట్టి ఆయన్ని మళ్ళీ 2019 నాటి ఫలితాల కంటే దారుణంగా ఓడించాలని అంతకంటే ఎక్కువగా రీ సౌండ్ వచ్చేలా మరోమారు రిజల్ట్ ఉండాలన్నది జగన్ ఇస్తున్న పిలుపు అని అంటున్నారు. మరి అయిదేళ్ల వైసీపీ పాలనతో సరిపోల్చుకుని టీడీపీ ఏలుబడిని చూసి ఈసారి జనాలు తీర్పు ఇస్తారు కాబట్టి ఏమవుతుంది అన్నది చూడాల్సి ఉంది.