టీడీపీ గేట్లు తీస్తే వైసీపీ మాయం...రాజకీయ సంచలనం!
టీడీపీ గేట్లు తెరిస్తే చాలు వైసీపీ మటు మాయం అవుతుందని చంద్రబాబు కడు నమ్మకంగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 29 Aug 2023 12:58 PM GMTరాజకీయాలు అన్న తరువాత జంపింగ్ జఫాంగులు ఉంటారు. అయితే ఏకంగా ఒక పార్టీ మరో పార్టీలోకి జంప్ చేస్తుందా. అంతలా ఫిరాయింపులు ఉంటాయా. ఉంటాయని అంటున్నారు ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ గేట్లు తెరిస్తే చాలు వైసీపీ మటు మాయం అవుతుందని చంద్రబాబు కడు నమ్మకంగా చెబుతున్నారు. ఒక్కరూ కూడా అటు మిగలరని, టోటల్ గా వైసీపీయే టీడీపీగా మారిపోతుందని ఆయన అంటున్నారు.
ఏపీలో టీడీపీకి ఎదురులేదు తిరుగులేదు అని అంటున్నారు చంద్రబాబు. ఏపీలో రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కచ్చితంగా టీడీపీయేనని ఆయన అన్నారు. ఇందులో డౌటే లేదని చెప్పేశారు. జగన్ ఓటమి అన్నది ఖాయమైపోయింది అని అన్నారు. ఏపీ బాగు పడాలీ అంటే జగన్ గద్దె దిగాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.
ఏపీలో టీడీపీ అభ్యర్ధులకు కొదవ లేదని, పోటీ చేసేందుకు ఒక్కో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున క్యూలో ఉన్నారని ఆయన అన్నారు. ఇక 2024లో ఏపీలో జరిగే ఎన్నికలు సంబంధించి అభ్యర్ధులను అందరినీ ఒకేసారి తమ పార్టీ ప్రకటిస్తుందని చంద్రబాబు ఇక కీలక ప్రకటన చేశారు. అంటే ఈ దసరాకు తొలి జాబితా వస్తుందని అందులో యాభై మంది అభ్యర్ధులకు తగ్గకుండా ఉంటారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బాబు చెప్పే మాటలను బట్టి అర్ధం అవుతోంది.
మొత్తం 175 సీట్లకు గానూ పొత్తులను పక్కన పెట్టి మిగిలిన సీట్లకు టీడీపీ పోటీ చేసే జాబితా అంతా ఒక్కసారే ప్రకటిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అంటే దసరాకు మొత్తం లిస్ట్ ఉంటుందా లేక మరింత సమయం తీసుకుని జాబితాను రిలీజ్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.
ఇదిలా ఉంటే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని బాబు మాటలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దగా పుంజుకోలేదని బాబు అంటున్నారు. దక్షిణాదిన కర్నాటక, తెలంగాణా తప్ప కాంగ్రెస్ ఎక్కడా లేదని ఆయన చెబుతున్నారు. ఏపీ తమిళనాడులో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలే లేవని బాబు తేల్చేశారు.
ఇక విపక్షాలు అన్నీ కలసి ఇండియా కూటమిగా ఏర్పడిన నేపధ్యంలో దాని మీద కూడా చంద్రబాబు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇండియా కూటమిలో చాలా మంది నేతలు ఉన్నారని, దానికి కన్వీనర్ ఎవరో వారే తేల్చుకోవాలని బాబు అంటున్నారు. ఇక మోడీ మీద విమర్శలు చేసే వారు ఎవరూ రాజకీయంగా అనుభవం ఉన్న వారు చేసే పని కాదని అన్నారు. అంటే అనుభవం లేని వారే మోడీని విమర్శిస్తున్నారు అంటూ అవుట్ రేట్ గా మోడీకి బాబు మద్దతు ఇచ్చారన్న మాట.
తాను దేశ రాజకీయాల్లో పాల్గొనేది లేనిది కాలమే నిర్ణయిస్తుందని బాబు చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. బాబు ఏపీ మీదనే ప్రస్తుతానికి ఫోకస్ పెట్టారు. రేపటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే బాబు సీఎం అవుతారు. ఆ తరువాత ఆయన జాతీయ రాజకీయాల మీద దృష్టి సారిస్తారు అన్న ప్రచారం ఉన్న నేపధ్యంలో బాబు ఈ కామెంట్స్ చేశారు.
మొత్తానికి బాబు వర్తమాన రాజకీయాల మీద ఇండియా కూటమి మీద మోడీ బీజేపీకి దేశంలో ఉన్న బలం మీద పూర్తి అవగాహనతో ఉన్నారని అంటున్నారు. 2019 నాటి తప్పులను మళ్ళీ టీడీపీ చేయదలచుకోలేదని కూడా బాబు మాటలను బట్టి అర్ధం అవుతోంది. అదే విధంగా ఇండియా కూటమి వైపు బాబు వెళ్ళే అవకాశాలు అసలు లేవని కూడా అర్ధం అవుతోంది అంటున్నారు.