Begin typing your search above and press return to search.

భారతీయ విద్యార్థిని బహిష్కరించొద్దని అమెరికా కోర్టు తీర్పు.. అసలేంటి వివాదం?

ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో అమెరికాలో అరెస్టయిన భారతీయ విద్యార్థి బదర్ ఖాన్ సురికి ఊరట లభించింది.

By:  Tupaki Desk   |   21 March 2025 1:04 PM IST
భారతీయ విద్యార్థిని బహిష్కరించొద్దని అమెరికా కోర్టు తీర్పు.. అసలేంటి వివాదం?
X

ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో అమెరికాలో అరెస్టయిన భారతీయ విద్యార్థి బదర్ ఖాన్ సురికి ఊరట లభించింది. అతడిని దేశం నుంచి బహిష్కరించేందుకు అమెరికా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అక్కడి న్యాయస్థానం నిలువరించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు బదర్ ఖాన్‌ను దేశం నుంచి పంపించవద్దని వర్జీనియాలోని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రస్తుతం లూసియానాలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న సురికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది.

జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడిగా ఉన్న బదర్ ఖాన్ సురి.. విశ్వవిద్యాలయంలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీ.హెచ్.ఎస్) అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా, ఆ ఉగ్రవాద సంస్థలోని పలువురితో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయని కూడా పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అధికారులు అతని వీసాను రద్దు చేయడమే కాకుండా గత సోమవారం వర్జీనియాలోని తన నివాసం నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ బదర్ ఖాన్ సురి కోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌లో ఇది పూర్తిగా రాజకీయ కుట్రపూరిత చర్య అని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా కోర్టు.. సురికి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయంపై న్యాయస్థానం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అతడిని అమెరికా నుంచి పంపించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సురిని లూసియానాలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచినట్లు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఎసీఎల్.యూ) వెల్లడించింది.

-అసలేంటి వివాదం అంటే?

భారతదేశానికి చెందిన బదర్ ఖాన్ సురి విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లారు. ఆయన ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. అనంతరం పోస్ట్ డాక్టోరల్ పరిశోధన కోసం అమెరికాలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో చేరారు. సురి భార్య మాఫెజ్ సలేహ్ పాలస్తీనా మూలాలున్న అమెరికా పౌరురాలు కావడం గమనార్హం. సలేహ్ తండ్రి గతంలో గాజా ప్రభుత్వంలో పనిచేసినట్లు సమాచారం.

ఇటీవల కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనాకు మద్దతుగా జరిగిన నిరసనలకు మద్దతు తెలిపిన మరో భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను కూడా అమెరికా రద్దు చేసింది. దీంతో ఆమె స్వచ్ఛందంగా అమెరికాను విడిచి వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో బదర్ ఖాన్ సురి కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఈ ఘటనలు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పాలస్తీనాకు మద్దతుగా గళం విప్పుతున్న విద్యార్థులపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. బదర్ ఖాన్ సురి విషయంలో అమెరికా న్యాయస్థానం తీసుకున్న తాత్కాలిక నిర్ణయం అతనికి కొంత ఊరటనిచ్చినప్పటికీ, ఈ కేసు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

ఇదిలా ఉండగా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్నవారు స్వచ్ఛందంగా దేశం నుంచి వెళ్లిపోయేందుకు వీలుగా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) 'హోమ్ యాప్'ను రూపొందించింది. దీనిపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులు ఈ యాప్‌ను ఉపయోగించుకుని దేశాన్ని విడిచి వెళ్లాలని సూచించారు. అలా చేయని వారిని బలవంతంగా పంపిస్తామని, అంతేకాకుండా శాశ్వతంగా అమెరికాలో అడుగు పెట్టకుండా చేస్తామని హెచ్చరించారు. స్వచ్ఛందంగా వెళ్లిపోయిన వారికి భవిష్యత్తులో చట్టబద్ధంగా తిరిగి అమెరికాకు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.