Begin typing your search above and press return to search.

హైదరాబాదీయులకు బ్యాడ్ న్యూస్.. ట్యాంక్ బండ్ వద్ద కేక్ కట్ చేస్తే ఫైన్

పుట్టినరోజు సందర్భంగా ముందురోజు అర్థరాత్రి పన్నెండు గంటల వేళలో.. ట్యాంక్ బండ్ వద్ద కేక్ కటింగ్ లతో పార్టీలు చేసుకోవటం ఎక్కువైంది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 2:30 PM GMT
హైదరాబాదీయులకు బ్యాడ్ న్యూస్.. ట్యాంక్ బండ్ వద్ద కేక్ కట్ చేస్తే ఫైన్
X

ఇప్పుడంటే హైదరాబాద్ మహానగరం పరిధి మరింత పెరిగింది కానీ పది పదిహేనేళ్ల క్రితం వరకు కూడా హైదరాబాద్ మహానగరానికి వచ్చే వారిలో అత్యధికులు వెళ్లాలనుకునే ప్లేస్ లో ట్యాంక్ బండ్ తప్పనిసరిగా ఉంటుంది. నగరానికి వచ్చే పర్యాటకులు మాత్రమే కాదు.. మహానగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సాయంత్రం వేళలో ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని.. అక్కడ ఎంజాయ్ చేయాలని తపిస్తుంటారు.

ఈ కారణంతోనే అన్ని దినాల్లోనూ రాత్రి అయితే చాలు.. ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం హడావుడి ఉంటుంది. ఇక.. వీకెండ్.. సెలవు దినాలు.. పర్వదినాల వేళలో అయితే.. అక్కడ ఉండే కోలాహలం మరో రేంజ్ లో ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఐదేళ్ల నుంచి కొత్త ట్రెండ్ ఒకటి మొదలైంది. పుట్టినరోజు సందర్భంగా ముందురోజు అర్థరాత్రి పన్నెండు గంటల వేళలో.. ట్యాంక్ బండ్ వద్ద కేక్ కటింగ్ లతో పార్టీలు చేసుకోవటం ఎక్కువైంది. పుట్టినరోజులు.. పెళ్లి రోజుల సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కటింగ్ చేయటం ఈ మధ్యన ఎక్కువైంది.

అయితే.. ఈ వేడుకల కారణంగా ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం కాగితాలు.. కేక్ డబ్బాలు.. స్పూన్లు.. కప్ లు.. కూల్ డ్రింక్ సీసాలు.. ఇలా మొత్తం చెత్త చెత్తగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జాం అవుతున్న పరిస్థితి. కారణం.. రోడ్డు పక్కనే ఇష్టారాజ్యంగా కార్లను పార్కు చేయటం ఇబ్బందికరంగా మారింది. పలుమార్లు ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి. దీనికి తోడు అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ మీద కేక్ కటింగ్ ప్రోగ్రాం చేస్తే.. ఫైన్లు వేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.