భారతీయ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్... షాకిచ్చిన యూకే!
తాజా సమాచారం ప్రకారం... ఆరు నెలల కంటే తక్కువ కాలానికి విజిట్ వీసా ధర 15 పౌండ్ల నుండి 115 పౌండ్లకు పెరుగుతోంది.
By: Tupaki Desk | 16 Sep 2023 5:03 PM GMTరోజు రోజుకీ విదేశీ విద్య బాగా పిరం అయిపోతున్న పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో తాజాగా యునైటెడ్ కింగ్ డం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వీసా ధరలను భారీగా పెంచింది. దీంతో భారతీయ విద్యార్థులకు భారీ షాక్ తగిలిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... యునైటెడ్ కింగ్ డమ్ సర్కార్ భారతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థి, పర్యాటక వీసాల ధరలను ఏకంగా 200 శాతం పెంచేసింది. ఈమేరకు బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో పార్లమెంటరీ ఆమోదం తర్వాత అక్టోబర్ 4వ తేదీ నుంచి పెంచిన ఫీజులు అమలులోకి రానున్నాయని తెలిపింది.
ఇలా వీసా ధరలు సుమారు 200శాతం ఒకేసారి పెంచడం వల్ల ప్రభుత్వ పథకాలకు ఎక్కువ నిధుల ప్రాధాన్యతకు అవకాశం లభిస్తుందని యూకే హోం ఆఫీస్ పేర్కొంది. వాళ్ల ఆలోచన అలా ఉంటే... మరో పక్క ఈ నిర్ణయం వల్ల లక్షలాదిమంది భారతీయ విద్యార్థులపై భారీ భారం పడనుంది!
తాజా సమాచారం ప్రకారం... ఆరు నెలల కంటే తక్కువ కాలానికి విజిట్ వీసా ధర 15 పౌండ్ల నుండి 115 పౌండ్లకు పెరుగుతోంది. విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా ఫీజు దాదాపు 127 పౌండ్లనుంచి 490 పౌండ్ల వరకూ పెరగనుంది. అలాగే పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసా ఫీజు కూడాపెరగనుంది.
కాగా జూలైలో అక్కడి ప్రభుత్వం వర్క్, విజిట్ వీసాల ధరలో 15 శాతం పెరుగుదలను ప్రకటించగా.. ప్రయార్టీ, స్టడీ వీసాలు, స్పాన్సర్ షిప్ సర్టిఫికేట్ ల ఫీజును 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే నెల నుంచి ఇప్పుడు భారీగా పెంచిన ధరలు అప్లై అవనున్నాయి.
మరోపక్క నివేదికల ప్రకారం 2021-2022లో 1,20,000 కంటే ఎక్కువ మందే భారతీయ విద్యార్థులు యూకేలో చదువుతున్నారు.