ఆరంభం నుంచి అపశకునాలే.. తెర మీదకు కొత్త వాదన!
గెలుపు వేళ ఎలా అయితే అన్ని అనుకూలంగా ఉంటాయో.. ఓటమి వేళ.. దానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తుంటాయి.
By: Tupaki Desk | 1 Dec 2023 4:54 AM GMTగెలుపు వేళ ఎలా అయితే అన్ని అనుకూలంగా ఉంటాయో.. ఓటమి వేళ.. దానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తుంటాయి. హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం పూర్తై.. ఈవీఎంలు స్ట్రాంగ్ రూంకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. పోలింగ్ పూర్తైనంతనే పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. మొత్తంగా రెండు డజన్లకు పైగా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఇందులో మూడు.. నాలుగు మినహా మిగిలిన సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కు అధికారం ఖాయమన్న మాటను చెప్పటమే కాదు.. అధికారంలోకి రావటానికి అవసరమైన స్పష్టమైన మెజార్టీ వస్తుందన్న అంచనాల్ని వెలువరించటం తెలిసిందే.
ఇలాంటివేళ.. గులాబీ కారుకు ఎదురుదెబ్బలు ఖాయమన్న రీతిలో కొన్ని సంకేతాలు ఎన్నికల నోటిఫికేషన్ నుంచి వెలువడ్డాయని.. జాగ్రత్తగా చూస్తే.. ఇవి కనిపిస్తున్నాయంటున్నారు. చిన్న తప్పులు సైతం పెద్ద తలనొప్పులుగా మారిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట మొత్తం సీన్ ను మార్చటమే కాదు.. ఈ రోజున ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేలా చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు నుంచే గులాబీ బాస్ కు ఈసారి ఎన్నికలు కలిసి రావని.. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఎదురుదెబ్బలు తినేలా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా ప్రయోగించిన ధరణి అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం చేసుకోవటంలో తప్పులో కాలేశారంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ధరణి సమస్యను ఎదుర్కొంటున్న వారు పదుల సంఖ్యలో ఉన్న విషయాన్ని గులాబీ బాస్ గుర్తించటంలో ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు.
ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత.. వాటికి మించిన విధంగా వరాలు ఇచ్చిన వైనం సైతం గులాబీ పార్టీకి ఎదురు దెబ్బగా మారింది. కాంగ్రెస్ వరాలు ఇచ్చే వరకు కసీఆర్ ఏం చేస్తున్నట్లు? వారు వరాలు ఇచ్చిన తర్వాత.. అంతకు మించి ఇస్తానని చెప్పటం నెగిటివ్ గా మారింది. దీనికి తోడు ఎన్నికలకు కాస్త ముందుగా మొదలైన గ్రూప్ 1 లీక్ పేపర్ల రచ్చను సమర్థంగా డీల్ చేయటంలో ఫెయిల్ కావటం.. అనంతరం నిరోద్యోగి ఆత్మహత్య విషయంలో కేసీఆర్ సర్కారు వ్యవహరించిన తీరు..వారి కుటుంబ సభ్యుల మీద తీసుకొచ్చిన ఒత్తిడికి సంబంధించిన తీరు ఒకటి తర్వాత ఒకటిగా ఎదురుదెబ్బలు తగలటం చూస్తేనే.. సెంటిమెంట్ సానుకూలంగా లేదన్న విషయం అర్థమవుతుంది.
అలా మొదలైన ఎదురుదెబ్బల పర్వం.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో.. ఆయనకు సంఘీభావంగా నిర్వహించిన ఆందోళనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సీమాంధ్రులకు మంట పుట్టేలా చేయటమే కాదు.. కేసీఆర్ సర్కారుకు సరైన గుణపాఠం నేర్పాలన్నట్లుగా డిసైడ్ కావటం మొదలు.. తెలంగాణ ఓటరుకు సీమాంధ్రుల ఆగ్రహం తోడు కావటం.. తాజా ఎగ్జిట్ పోల్స్ కు కారణంగా చెబుతున్నారు. మొత్తంగా..ఆరంభం నుంచే అపశకునాలు ఎదురైన పరిస్థితి బీఆర్ఎస్ లో ఉందని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనలో నిజం ఎంతన్నది తేలాలంటే.. ఆదివారం వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది.