బద్వేల్ ఎమ్మెల్యే పక్క చూపులు.. టీడీపీలోకి జంపేనా.. ?
ఈ క్రమం లో ఇక్కడి ఎమ్మెల్యే సుధను పార్టీలోకి తీసుకునే దిశగా స్థానిక కీలక నాయకులు చర్చలు చేస్తున్నట్టు తెలిసింది.
By: Tupaki Desk | 21 Dec 2024 2:30 AM GMTవైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కడప కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు.. పార్టీ మారి వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. వీరిని కాపాడుకునేందుకు ఎంపీ అవినాష్‌రెడ్డిని రంగంలోకి దింపినా ఫలితం అయితే.. కనిపించలేదు. ఇక, సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా.. వైసీపీ చేతులు ఎత్తేసింది. ఫలితంగా ఉమ్మడి కడపలో వైసీపీ ప్రభావం నానాటికీ తగ్గిపోతోంది.
ఇక, ఇప్పుడు తాజాగా సాధ్యమైనంత వరకు వైసీపీ నేతలను ఆ పార్టీకి దూరం చేసే రాజకీయాలు సాగుతు న్నాయి. దీనిలో వైసీపీనాయకుల పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా బద్వేల్ వంటి కీలకమైన ఎస్సీ నియోజ కవర్గంపై టీడీపీ నేతలు కన్నేశారు. ఇది ఏమాత్రం తప్పుకాదు. వారి రాజకీయ వ్యూహాలు వారివి. ఈ క్రమం లో ఇక్కడి ఎమ్మెల్యే సుధను పార్టీలోకి తీసుకునే దిశగా స్థానిక కీలక నాయకులు చర్చలు చేస్తున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలో ఇప్పటికే రెండు సార్లు ఆమెతో చర్చించారని కూడా సమాచారం.
బద్వేల్ నుంచి వరుసగా రెండోసారి(భర్త మరణంతో తొలిసారి, ఈ ఏడాది ఎన్నికల్లో రెండోసారి) విజయం దక్కించుకున్నారు సుధ. అయితే.. వైసీపీలో నెలకొన్న వర్గ విభేదాల కారణంగా.. ఆమె ఎటు పక్షం వహిం చాలో తెలియక సతమతం అవుతున్నారు. ఎంపీ అవినాష్ వర్గంగా ఆది నుంచి ముద్ర వేసుకున్న సుధ ను మరో వర్గం పక్కన పెట్టింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ చర్చ సాగింది. అయితే.. ఇప్పుడు రెండు వర్గాల ఒత్తిడి మరింత పెరిగింది.
మరోవైపు.. నియోజకవర్గం అభివృద్ధి అంశం కూడా సుధకు తలనొప్పిగా మారింది. టీడీపీదే పైచేయిగా ఉండడంతో ఆమె ఏమీ చేయలేక పోతున్నారు. ఇక, వైసీపీ అధినేత నుంచి కూడా.. ఆమెతో సరైన కమ్యూనికేషన్ లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సుధ.. కూడా వైసీపీపై పెద్దగా ఇంట్రస్ట్ తో లేరని ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ నేతలు ఆమెను సైకిల్ ఎక్కించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు చర్చలు కూడా పూర్తయ్యాయని తెలిసింది. త్వరలోనే ఆమె టీడీపీ గూటికి చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.