Begin typing your search above and press return to search.

బైరి నరేష్ రచ్చ.. అయ్యప్పస్వాముల వాగ్వాదం.. కారు బోల్తా

ఇప్పుడు అందుకు భిన్నంగా తమ మనోభావాల్ని దెబ్బ తీసే వారిని ప్రశ్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 4:44 AM GMT
బైరి నరేష్ రచ్చ.. అయ్యప్పస్వాముల వాగ్వాదం.. కారు బోల్తా
X

ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి అభిప్రాయాలు వారికి. ఎదుటి వారి మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తాను నమ్మినవాదాన్ని పంచుకునేందుకు.. ఎదుటోళ్ల నమ్మకాల్ని గేలి చేయటం.. వారిని మాటలతో నోటికి వచ్చినట్లుగా అనేయటం ఒక అలవాటుగా మారింది. గతంలో ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా తమ మనోభావాల్ని దెబ్బ తీసే వారిని ప్రశ్నిస్తున్నారు. అంతకు మించి నిలదీస్తున్నారు.

నాస్తికవాది అయిన బైరి నరేశ్.. తన చేతికి మైకు వస్తే చాలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. తన మాటలతో లక్షలాది మంది మనోభావాల్ని గాయపరిచే ఆయన.. తాను చేసిన పనికి సరైన రీతిలో సమాధానం ఇచ్చింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ప్రాగ్రాంలో పాల్గొనేందుకు వచ్చిన అతగాడి గురించి తెలుసుకున్నఅయ్యప్ప స్వాములు.. శివ స్వాములు ఆయన్ను నిలదీసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా చోటు చేసుకన్న పరిణామాలు సంచలనంగా మారాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బీఆర్ ఫంక్షన్ హాట్ లో భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు కొండగొర్ల రాజేశ్ ఆధ్వర్యంలో భీమా కోరే గావ్ స్ఫూర్తి దినాన్ని నిర్వహించారు. దీనికి అతిధిగా బైరి నరేశ్ ను ఆహ్వానించారు. దీని గురించి తెలుసుకున్న అయ్యప్ప మాలధారులు.. శివస్వాములు కలిసి ఈ కార్యక్రమం జరుగుతున్న వద్దకు వెల్లారు. నరేష్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలో నరేశ్ కారు ఎక్కారు.

డ్రైవర్ ను త్వరగా పోనివ్వాలని తొందరపెట్టారు. దీంతో.. కారు డ్రైవర్ ఒత్తిడికి గురై.. తమ వాహనం ఎదుట ఉన్న టూ వీలర్ ను ఢికొట్టారు. దీంతో.. వాహనం మీద ఉన్న అయ్యప్ప మాలధారికి గాయాలయ్యాయి. అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. కాలు విరిగినట్లుగా గుర్తించారు. ఈ ఉదంతంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహాన్నివ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు.

బైరి నరేశ్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో.. అయ్యప్ప స్వాముల ఆందోళన నేపథ్యంలో బైరి నరేశ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అలెర్టు అయ్యారు. ఇందులో భాగంగా అటవీశాఖ చెక్ పోస్టు వద్ద కాపు కాశారు. పోలీసుల్ని తప్పించుకోవటానికి బైరి నరేశ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వరంగల్ వైపు కాకుండా భద్రాచలం రోడ్డు వైపు మళ్లించారు.ఈ క్రమంలో కారు గుంతలో పడి బ్యాలెన్స్ మిస్ అయి.. బోర్లా పడింది. పోలీసులు అక్కడి వెళ్లే లోపే.. కారు డ్రైవర్ తో పాటు.. బైరి నరేశ్ ఇద్దరు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. వారిని అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. నోటి నుంచి వచ్చే మాటలపై కంట్రోల్ ఉంచుకుంటే.. ఈ రచ్చ అంతా జరిగి ఉండేది కాదుకదా?