వైసీపీకి దూరం జరుగుతున్న సీనియర్ ఎమ్మెల్యే ?
వైసీపీకి 2024 ఎన్నికల్లో గెలిచిందే అచ్చంగా 11 మంది ఎమ్మెల్యేలు. అందులో కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారు అని వార్తలు రావడం కలవరం కలిగించే విషయమే అని అంటున్నారు.
By: Tupaki Desk | 4 Feb 2025 3:52 AM GMTవైసీపీకి 2024 ఎన్నికల్లో గెలిచిందే అచ్చంగా 11 మంది ఎమ్మెల్యేలు. అందులో కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారు అని వార్తలు రావడం కలవరం కలిగించే విషయమే అని అంటున్నారు. రాయలసీమలో వైసీపీ గెలిచిందే తక్కువ సీట్లు అయితే వీరి నుంచి ఒకరిద్దరు ఇపుడు పక్క చూపులు చూస్తున్నారు అని వార్తలు ప్రచారం కావడం విశేషం.
వైసీపీ అధినాయకత్వం పోకడలతో విభేదిస్తున్న వారే ఇలా దూరం జరుగుతున్నారని అంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూస్తే ఈసారి ఎన్నికల్లో ఇద్దరే ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఆలూరు నుంచి విరూపాక్షి మంత్రాలయం నుంచి బాల నాగిరెడ్డి గెలిచారు. ఇందులో విరూపాక్షి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఆయన పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారు. అలాగే ప్రభుత్వం మీద పదునైన విమర్శలు చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. అయితే మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి మాత్రం గత ఏడు నెలలుగా పెద్దగా పార్టీ కార్యక్రమాలలో కనిపించడం లేదు అన్న విమర్శలు సొంత పార్టీ వారే చేస్తునారు.
ఆయన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినదీ పెద్దగా లేదు అని గుర్తు చేస్తున్నారు. ఆయన అధికార పార్టీ పట్ల సానుకూలంగా ఉండడం వల్లనే ఈ విధంగా చేస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. ఆయన రాజకీయ ప్రస్తానం చూస్తే ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ గా ఉన్నారు. 2009లో టీడీపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన బాల నాగిరెడ్డి ఆ తరువాత వైఎస్సార్ మీద అభిమానంతో కాంగ్రెస్ లో చేరిపోయారు.
అక్కడ నుంచి ఆయన వైసీపీలోకి వచ్చారు. 2014, 2019, 2024లలో ఆయన వరసగా వైసీపీ నుంచి గెలిచారు. అయితే పార్టీ 2019లో అధికారంలోకి వచ్చినపుడు ఆయన మంత్రి పదవిని ఆశించారు. అప్పటికి మూడు సార్లు గెలిచి సీనియర్ గా ఉన్నందువల్ల ఆయన మినిస్టర్ కావాలని కోరుకున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డినే అయిదేళ్ళూ కొనసాగించింది. దాంతో సామాజిక సమీకరణలు సరితూగక ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయింది.
అయితే జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. కానీ కొన్నాళ్ళు మాత్రమే చేసి ఆయన దానిని వదిలేశారు. అలా తన అసంతృప్తిని ఆయన అపుడే వ్యక్తం చేశారు. ఇపుడు చూస్తే పార్టీ ఎటూ అధికారంలో లేదు. దాంతో ఆయన విపక్ష ఎమ్మెల్యేగా చేయాల్సింది ఏమీ లేదని భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక అసెంబ్లీకి కూడా వెళ్ళకుండా వైసీపీ తీసుకున్న నిర్ణయంతో కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయన పార్టీ ఆదేశాలను పెద్దగా పాటించడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కర్నూల్ లో వైసీపీ రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పార్టీ సమావేశానికి కూడా బాల నాగిరెడ్డి గైర్ హాజరు కావడంతో ఆయన వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్న చర్చ అయితే పార్టీ వర్గాలలో ఉంది అంటున్నారు.
ఇక బాల నాగిరెడ్డి రాజకీయ అరంగేట్రమే టీడీపీ నుంచి కాబట్టి ఆయన మళ్ళీ సైకిలెక్కుతారా అన్నది పుకార్లుగా షికారు చేస్తోంది. దీనికి ఆయన నుంచే స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. ఆయనతో పాటు రాయలసీమకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా వేరే ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. మరె ఈ పుకార్లు నిజమే అయితే వైసీపీకి దెబ్బ పడినట్లే అని అంటున్నారు.