ఇదేం పద్ధతి బాలయ్యా..?
నందమూరి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
By: Tupaki Desk | 21 March 2025 10:59 AM ISTనందమూరి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తమ అభిమాన నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే హోదాలో ఈ సారి కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేశారంటున్నారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య.. ఎప్పుడూ లేనట్లు ఈ సారి సభకు గైర్హాజరు కావడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనట్లు ఈ సారి ఎమ్మెల్యేల క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దాదాపు అందరు ప్రజా ప్రతినిధులు కనిపించి వేడుక చేసినా బాలయ్య లేకపోవడం పెద్ద లోటుగా అభివర్ణిస్తున్నారు.
ఎమ్మెల్యేగా బాలకృష్ణ చాలా యాక్టివ్ గా ఉంటారు. తన నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. తరచూ పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటారు. ప్రతిపక్షంలో కూడా అసెంబ్లీకి వెళ్లి తన పాత్ర పోషించిన బాలయ్య.. ఈ సారి తిరుగులేని మెజార్టీ ఉందని కాస్త వెనక్కి తగ్గుతున్నారా? అనే చర్చ జరుగుతోంది. సుమారు 15 రోజులు పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య ఒక్కరోజు కనిపించకపోవడం గమనార్హం. ఎప్పుడూ కూడా బాలయ్య ఇలా సభకు డుమ్మా కొట్టిన పరిస్థితి లేదంటున్నారు. తొలిసారిగా ఆయన ఒక సెషన్ మొత్తం రాలేదని అంటున్నారు. బాలయ్య ఇలా ఎందుకు చేశారంటూ టీడీపీ కార్యకర్తల్లోనూ హిందుపురం నియోజకవర్గంలోనూ చర్చ జరుగుతోంది.
ఇక వ్యక్తిగతంగానూ సరదా మనిషిగా బాలయ్యకు పేరుంది. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటుంటారు. అలాంటి బాలయ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆటల పోటీల్లో పాల్గొనకపోవడం లోటుగా కనిపిస్తోందని అంటున్నారు. ఎన్నడూ లేనట్లు చాలా ఆహ్లాదకరంగా సాగిన పోటీల్లో ఎమ్మెల్యేలు వివిధ పోటీల్లో పాల్గొని కనువిందు చేశారు. ఇక సాంస్కృతిక పోటీల్లోనూ డిప్యూటీ స్పీకర్ రఘు రామరాజు, మంత్రి కందుల దుర్గేశ్ వంటి వారు రాణించారు. స్వతహాగా నటుడైన బాలయ్య వస్తే ఆ ఇద్దరి కన్నా తన నట విశ్వరూపంతో ఆకట్టుకునే వారంటున్నారు. కానీ, ఈ సారి బాలయ్య అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొత్తానికి రాకపోవడంతో ఈ పోటీలను మిస్ అయ్యారు.
అయితే బాలయ్య సభకు రాకపోవడానికి ప్రధాన కారణం అఖండ-2 సినిమాయే అనే ప్రచారం జరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రీకరిస్తున్న అఖండ-2 షూటింగ్ ప్రస్తుతం చాలా స్పీడుగా జరుగుతోంది. ఈ షూటింగ్ పనిపై ముందుగా షెడ్యూల్ నిర్ణయించడంతో బాలయ్య అసెంబ్లీకి, ఎమ్మెల్యేల పోటీలకు హాజరుకాలేకపోయారంటున్నారు. ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్న బాలయ్య నిరవధిక షెడ్యూల్ తో ఖాళీ లేకుండా గడుపుతున్నారని చెబుతున్నారు. అందువల్లే తన పొలిటికల్ కెరీర్ లోనే తొలిసారిగా అసెంబ్లీకి డుమ్మా కొట్టారని చెబుతున్నారు.