హిందూపురంలో బాలయ్య రాజకీయ చాణక్యం.. నాలుగేళ్ల క్రితం పరాభవానికి ప్రతీకారం!
సినిమాల్లో ఎన్నో ఫైటింగ్ సీన్లలో ప్రత్యర్థులను దెబ్బతీయడం హీరో బాలయ్యకు కొత్తకాదు. కానీ, ఎమ్మెల్యేగా తొలిసారి ప్రత్యర్థులను దెబ్బకు దెబ్బ తీశారు.
By: Tupaki Desk | 4 Feb 2025 10:27 AM GMTసినిమాల్లో ఎన్నో ఫైటింగ్ సీన్లలో ప్రత్యర్థులను దెబ్బతీయడం హీరో బాలయ్యకు కొత్తకాదు. కానీ, ఎమ్మెల్యేగా తొలిసారి ప్రత్యర్థులను దెబ్బకు దెబ్బ తీశారు. నాలుగేళ్ల క్రితం తనకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. హిందూపురం మున్సిపాలిటీలో పసుపు జెండా ఎగరేసి తనలో పరిణితి చెందిన రాజకీయ చాణక్యుడు కూడా ఉన్నారని నిరూపించారు.
హిందూపురం టీడీపీకి ఎంతో ప్రత్యేకం.. 1983లో టీడీపీ ఆవిర్భవించిన నుంచి ఇప్పటివరకు ఆ పార్టీకి ఎదురులేదు. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి హిందూపురంతో విడదీయరాని అనుబంధం ఉంది. గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన కుమారుడు, సినీ కథానాయకుడు బాలక్రిష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 2014లో తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసిన బాలయ్య ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ గెలిచారు. పార్టీకి పట్టు ఉండటం వల్ల ఆయన గెలుపును పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. అయితే నిన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో బాలయ్య చాణక్యం తొలిసారి బయటపడింది. శాసనసభ్యుడిగా ఆయన సాధించిన విజయం కన్నా, ఇది గొప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో వైసీపీ నుంచి గెలిచిన వారు 30 మంది. టీడీపీకి ఆరుగురు ఉండగా, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలిచారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హిందుపురంలో వైసీపీ గెలవడం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. టీడీపీ కంచుకోటలో ఇంకోపార్టీ జెండా ఎగరడం అదే తొలిసారి. అప్పట్లో వైసీపీ విజయం టీడీపీకి, వ్యక్తిగతంగా బాలయ్యకు తీరని అవమానంగా భావించారు. అయితే ఆ ఎన్నికల్లో గెలుపు కోసం బాలయ్య ఎంతో కష్టపడ్డారు. కానీ, అప్పటి ప్రభుత్వ పెద్దలు హిందుపురంపై స్పెషల్ ఫోకస్ చేసి అన్నివిధాల బాలయ్యను నిలువరించి, నిస్సహాయుడిని చేసి హిందుపురంలో 30 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. దీనిని తనకు జరిగిన అవమానంగా భావించిన బాలయ్య ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారు.
2021 ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా గెలిచిందో అదే పంథాను అనుసరించి.. హిందుపురంలో టీడీపీ జెండా ఎగిరేలా చేశారని ఎమ్మెల్యే బాలక్రిష్ణపై టీడీపీ క్యాడర్ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. హిందుపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన జైత్రయాత్ర ఇప్పుడు పరిపూర్ణమైనట్లు భావిస్తోంది. మున్సిపల్ చైర్మనుగా తన అనుచరుడని గెలిపించుకోడానికి ఎమ్మెల్యే బాలయ్య తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. పార్టీకి కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. బాలయ్య ముందుండి నడవడంతో హిందుపురంలో వైసీపీకి మెజార్టీ ఉన్నా, చైర్మన్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. ఏదిఏమైనా ఈ ఎన్నికతో సినిమాల్లో కథానాయకుడిగా వెలుగొందుతున్న బాలయ్య పాలిటిక్స్ లో సరైన నాయకుడిగా నిరూపించుకున్నారని అభినందనలు పొందుతున్నారు.