Begin typing your search above and press return to search.

తేనె తుట్టెను కదల్చిన బాలయ్య...బాబు ఏమంటారో ?

ఆరు నెలల వ్యవధిలో వాటిని పూర్తి చేసి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   15 July 2024 3:15 AM GMT
తేనె తుట్టెను కదల్చిన బాలయ్య...బాబు ఏమంటారో ?
X

ప్రముఖ సినీ నటుడు హిందూపురం టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తాజాగా హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా పర్యటనలు చేశారు. తన నియోజకవర్గంలో నిలిచిపోయిన టిడ్కో ఇళ్ళను పరిశీలించారు. ఆరు నెలల వ్యవధిలో వాటిని పూర్తి చేసి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఆ మీదట ఆయన మీడియాతో హిందూపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రాన్ని మార్పు చేయాలన్న డిమాండ్ ఉందని ఆ విషయంలో టీడీపీ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కేవలం హిందూపురంలోనే ఈ డిమాండ్ లేదని, రాష్ట్రంలో చాలా చోట్ల ఉందని ఏమి చేయాలో ప్రభుత్వం చేస్తుందని బాలయ్య అన్నారు.

ఒక విధంగా ఇది రాజకీయంగా చర్చకు ఆస్కారం ఇచ్చేలా ఉంది అంటున్నారు. అలాగే తేనె తుట్టెని కదల్చడం గానే చూడాలని అంటున్నారు. ఎందుకంటే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయమని డిమాండ్ ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని వైసీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రంగా చేసింది.

అయితే సత్యసాయి జిల్లాలో హిందూపురం పెద్ద పట్టణంగా ఉంది. అంతే కాదు పుట్టపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్వాల్సి ఉంటుందని అంటున్నారు. గత ప్రభుత్వం ఆధ్యాత్మిక పట్టణం అని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేసింది.మరో వైపు చూస్తే హిందూపురం టీడీపీది కావడం వల్ల కూడా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిందని అంటున్నారు.

హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బాలయ్య ఉన్నారు కాబట్టి హిందూపురాన్ని జిల్లా కేంద్రం తప్పకుండా చేస్తారు అని అంటున్నారు. ఒక విధంగా ఈ డిమాండ్ ని బాబు ముందు పెడతారు అని అంటున్నారు. అయితే బాలయ్య చెప్పినట్లుగానే కేవలం సత్యసాయి జిల్లావే కాదు చాలా చోట్ల జిల్లా కేంద్రాలను మార్చాలని అంటున్నారు అలా అన్నమయ్య జిల్లాతో పాటు అనేక చోట్ల కూడా డిమాండ్లు ఉన్నాయి.

ఇది ఒక విధంగా సవాల్ గానే చూడాలి ఒకసారి జిల్లా కేంద్రం అని ప్రకటించి దానిని తీసేసి వేరే చోటకు తరలిస్తే అక్కడ వారు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చర్చగా ఉంది. అలాగే తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయమని ఎక్కువగా ప్రతిపాధనలు వస్తే అపుడు కొత్త సమస్యలు అనేకం వస్తాయని అంటున్నారు.

జిల్లాల పునర్ విభజన అన్నది చాలా క్లిష్టమైన వ్యవహారం. ఆ విషయంలో స్మూత్ గానే చేయాలి. కానీ రాజకీయంగా ఎవరి ఆశలు వారికి ఉంటాయి. అదే విధంగా సెంటిమెంట్లు కూడా ఉంటాయి. దాంతో ఇది ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. ఏది ఏమైనా బాలయ్య తేనె తుట్టెను కదిపారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి డిమాండ్ల మీద ఏ విధంగా ఆలోచిస్తుందో అన్నది చూడాల్సి ఉంది.