బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర.. ఈసారి ఎవరు దక్కించుకున్నారంటే..?
వినాయకుడి నవరాత్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఊరావాడా వినాయక విగ్రహాలను నెలకొల్పి ప్రజలు పూజలు చేశారు.
By: Tupaki Desk | 17 Sep 2024 5:45 AM GMTవినాయకుడి నవరాత్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఊరావాడా వినాయక విగ్రహాలను నెలకొల్పి ప్రజలు పూజలు చేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లో మాత్రం ఉత్సవాలు మరింత ఘనంగా జరిగాయి. ఇక ఇక్కడ బడా గణేశ్‌గా ఖైరతాబాద్ ఏటా రికార్డు సాధిస్తే.. బాలాపూర్ గణేశ్ మాత్రం తన లడ్డూ వేలం పాటతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వినాయక నిమజ్జనం సమయం వచ్చిందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా బాలాపూర్ లడ్డూ వేలం పాట కోసం ఆసక్తి ఎదురుచూస్తుంటారు.
బాలాపూర్ గణేశ్ లడ్డూకి ఉన్న చరిత్ర మామూలుది కాదు. లంబోదరుడి చేతిలో పూజలందుకున్న ఈ లడ్డూని కైవసం చేసుకుంటే వారి ఇంట సిరిసంపదలు కలుగుతాయని అందరి విశ్వాసం. 1980లో బాలాపూర్ గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి అక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటిసారి 1994లో లడ్డూకు వేలం పాట నిర్వహించడం ప్రారంభించారు. ఆ సమయంలో స్థానికుడు రూ.450కి కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను స్వాధీనం చేసుకున్నారు. వారు ఆ లడ్డూను తమ పొలంలో చల్లారు. దాంతో ఆ ఏడాది అంతా ఆ కుటుంబానికి మంచి జరిగింది. లడ్డూ రావడం వల్లనే తమ కుటుంబానికి బాగా కలిసొచ్చిందని మోహన్ రెడ్డి మరుసటి ఏడాది 1995లోనూ పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. ఆ ఏడాది రూ.4,500లకు ఆయన వేలం పాట పాడారు.
దాంతో.. ఏటా బాలాపూర్ గణేశ్ లడ్డూకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. ఏటా రికార్డు స్థాయి ధర పలుకుతూనే ఉంది. వందలు, వేలల్లో నుంచి ఇప్పుడు లక్షల వరకు చేరుకుంది లడ్డూ ధర. 2001 వరకు లడ్డూ కేవలం వేలల్లోనూ పలికింది. 2002లో మాత్రం 1,05,000 ధర పలికింది. దాంతో ఒక్కసారిగా లడ్డూ ధర లక్ష దాటింది. 2015లో ఆ ధర రూ.10 లక్షలకు చేరుకుంది. ఆ సంవత్సరం 4,15,000 వేలం పలికింది.
నిన్నటి నుంచి అందరి దృష్టి బాలాపూర్ లడ్డూపైనే ఉంది. ఎప్పుడెప్పుడా ఎదురుచూసిన ఆ తరుణం రానే వచ్చింది. బాలాపూర్ లడ్డూకి నిమజ్జనం వేళ నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ ఏడాది కూడా భారీ ధర పలికింది. 2023లో రూ.27 లక్షలకు లడ్డూ ధర పలుకగా.. స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి ఈసారి రూ.30.1 లక్షలతో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నాడు.