అధికారిక ప్రకటన.. బాలశౌరి పోటీ అక్కడి నుంచేనట!
వైసీపీకి రాజీనామా ప్రకటించాక బాలశౌరి తన కుమారుడితో హైదరాబాద్ వెళ్లి జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jan 2024 8:04 PM GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముంగిట «అధికార ౖవైసీపీకి గట్టి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ ఎంపీ, జిల్లాలో కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరి తన పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన బందరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీకి చెందిన కొనకళ్ల నారాయణపై విజయం సాధించారు.
వైసీపీకి రాజీనామా ప్రకటించాక బాలశౌరి తన కుమారుడితో హైదరాబాద్ వెళ్లి జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కృష్ణా జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవిలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలశౌరి తాను తిరిగి బందరు నుంచే జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో రెండు గంటల పాటు వివిధ అంశాలు చర్చించానని.. ఆయన విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించినట్టు తెలిపారు. మరో కొద్ది రోజుల్లో జనసేన పార్టీలో చేరతానన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని స్పష్టం చేశారు. దీంతో మచిలీపట్నం సీటు జనసేనకేనని వెల్లడైంది. దీంతో బందరు ఎంపీ సీటును టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనకు వదిలివేసినట్టు బాలశౌరి ప్రకటనతో తేటతేల్లమైంది.
పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వకుండా బాలశౌరి బందరు నుంచే తానే మళ్లీ పోటీ చేస్తున్నానని చెప్పి ఉండరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఈ మేరకు చర్చించి, ఆయన ఆమోదం తీసుకున్నాకే బందరు ఎంపీగా పోటీ చేస్తున్నానని ప్రకటించి ఉంటారని అంటున్నారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు సన్నిహితుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వల్లభనేని బాలశౌరి 2004లో తొలిసారి గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఇక 2009లో ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై కేవలం 1607 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బాలశౌరి తరఫున నాడు ఎన్నికల్లో అరంగేట్రం చేసిన వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ ప్రచారం చేయడం విశేషం.
ఇక 2014 ఎన్నికల్లో గుంటూరు నుంచి వల్లభనేని బాలశౌరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. బాలశౌరిపై టీడీపీకి చెందిన గల్లా జయదేవ్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బాలశౌరి బందరు నుంచి బరిలోకి దిగి వైసీపీ తరఫున విజయం సాధించారు.
వల్లభనేని బాలశౌరి కాపు సామాజికవర్గానికి చెందినవారు. తన పొలిటికల్ కెరీర్ లో నాలుగుసార్లు నాలుగు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఏకైక నేత కూడా బాలశౌరే కావడం గమనార్హం. మొత్తం మీద నాలుగుసార్లు (రెండుసార్లు కాంగ్రెస్, మరో రెండుసార్లు వైసీపీ) పోటీ చేసిన బాలశౌరి రెండుసార్లు గెలుపొందారు. ఒకసారి కాంగ్రెస్ తరఫున గెలుపొందగా, మరోసారి వైసీపీ తర ఫున విజయం సాధించారు.
ప్రస్తుతం బందరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నానికి, వల్లభనేని బాలశౌరికి మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. స్థానిక ఎంపీగా బాలశౌరి పర్యటనను పేర్ని నాని వర్గీయులు పలుమార్లు అడ్డుకున్నారు. అలాగే బందరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అవనిగడ్డలోనూ స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి చంద్రశేఖర్ కు, బాలశౌరికి మధ్య విభేధాలు ఉన్నాయి. అవనిగడ్డలో సైతం ఎమ్మెల్యే వర్గీయులు బాలశౌరి పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై బాలశౌరి సీఎం వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తితోనే బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి.