బాలయ్యపై అభిమానం.. వందలాది నిరుపేదలకు రోజూ అన్నదానం
అభిమానం ఉండాలే కానీ ఏమైనా చేయొచ్చన్న విషయం మరోసారి నిరూపితమైంది. సినీ నటులు.. క్రీడాకారులు.. ఇలా కొందరి మీద అభిమానంతో వారి అభిమానులు పలు సేవా కార్యక్రమాల్ని చేపడతారు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి వెలుగు చూసింది. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ మీద అభిమానంతో అమెరికాలో ఉన్న ఒక తెలుగోడు.
By: Tupaki Desk | 2 Aug 2023 4:32 AM GMTఅభిమానం ఉండాలే కానీ ఏమైనా చేయొచ్చన్న విషయం మరోసారి నిరూపితమైంది. సినీ నటులు.. క్రీడాకారులు.. ఇలా కొందరి మీద అభిమానంతో వారి అభిమానులు పలు సేవా కార్యక్రమాల్ని చేపడతారు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి వెలుగు చూసింది. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ మీద అభిమానంతో అమెరికాలో ఉన్న ఒక తెలుగోడు.. నిరుపేదలకు చేపట్టిన అన్నదానం వందలాది మందికి రోజూ ఆకల్ని తీరుస్తోంది. హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి నిత్యం పెద్ద ఎత్తున పేదలు.. నిరుపేదలు వస్తుంటారు.
చికిత్సలో భాగంగా రోజుల తరబడి ఉండాల్సి ఉంటుంది. పేషెంట్లకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న వేళ.. వారి కోసం అక్కడే ఉండే నిరుపేదలకు రోజువారీ భోజన సౌకర్యం ఖర్చుతో కూడుకున్నది. దీంతో.. వారు అంతో ఇంతో తిని కాలం గడిపేస్తుంటారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ కు చెందిన శివ గమనించాడు. కేబీఆర్ పార్కు వద్దకు వాకింగ్ కు వచ్చే ఆయన.. బసవతారకం ఆసుపత్రి వద్ద పేషెంట్ల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారి బంధువులు.. వారు పడే పాట్లను గమనించి.. ఇదే విషయాన్ని అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న తన స్నేహితుడు ఉప్పుటూరి రామ్ కు చెప్పారు.
గుంటూరు జిల్లాలోని పుల్లడిగుంట ప్రాంతానికి చెందిన రామ్ గడిచిన ఇరవై ఏళ్లుగా అమెరికాలో ఐటీ ఉద్యోగిగా ఉంటున్నాడు. బసవతారకం ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులు పడే ఇబ్బందులు.. అన్నం కోసం వారికున్న సమస్య గురించి రామ్ కు అతడి స్నేహితుడు శివ చెప్పటంతో కదిలిపోయాడు. తన అభిమాన నటుడు బాలక్రిష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బసవతారకం ఆసుపత్రి వద్ద ఉండే రోగుల సహాయకులకు అన్నదానం చేయాలని డిసైడ్ అయ్యాడు.
అంతే.. గడిచిన యాభై రోజులుగా ఈ అన్నదానం కార్యక్రమం సాగుతోంది. ప్రతి రోజు మధ్యాహ్నం వేళకు వేడి వేడి అన్నం.. కూరలతో సహా చక్కటి భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు. మొదట్లో రోజుకు 200 మందికి భోజనాలు పెట్టేవాళ్లు. ఇప్పుడు అది ఏకంగా 300-500 మంది వరకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. అన్నదానం అంటే రైస్.. పప్పు.. ఒక కూర.. మజ్జిగ అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
అన్నదానం మెనూలో అన్నం.. వెజ్ బిర్యానీ.. పప్పు.. కూర.. పచ్చడి.. సాంబారు.. లడ్డు.. వడియాలు.. మజ్జిక.. అప్పడాలు ఇలా అన్నీ అందజేస్తారు. అంతేకాడు.. వారానికి రెండు మూడు సార్లు చికెన్ కర్రీ.. బిర్యానీ.. గుడ్డు లాంటివి అందిస్తున్నారు. తన స్నేహితుడు శివ చెప్పిన మాటల ప్రభావంతో తన అభిమాన నటుడు బాలక్రిష్ణ పుట్టిన రోజు నుంచి వంద రోజులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా.. వస్తున్న స్పందనతో నిత్య అన్నదాన కార్యక్రమంగా మార్చాలని భావిస్తున్నట్లుగా రామ్ సన్నిహితులు చెబుతున్నారు. అభిమానం అంటే ఇది కదా? నలుగురి కడుపు నింపే ఈ తరహా కార్యక్రమాల్ని పలువురు నిర్వహిస్తే ఎంత బాగుండో కదా?