Begin typing your search above and press return to search.

బాబుకు బాలయ్య పాదాభివందనం... ఎనీ డౌట్స్....?

పైగా తన కంటే పదేళ్ళు పెద్ద అయిన చంద్రబాబు అంటే బాలయ్యకు గురుభావం కూడా ఉంది అంటారు. చంద్రబాబులో ఒక గొప్పతనం ఉంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 3:48 AM GMT
బాబుకు  బాలయ్య పాదాభివందనం... ఎనీ డౌట్స్....?
X

నందమూరి కుటుంబంతో నారా కుటుంబం వియ్యం అందుకుంది. ఒకసారి కాదు రెండు సార్లు. మొదట తాను ఎన్టీయార్ ఇంటికి మూడవ అల్లుడిగా వెళ్ళిన చంద్రబాబు అదే నందమూరి ఫ్యామిలీకి రెండవ తరం వారసుడు బాలయ్య తో మరోసారి వియ్యం అందుకున్నారు. తన కుమారుడు లోకేష్ ని బ్రాహ్మణికి ఇచ్చి వివాహం చేయించి నారా నందమూరి బంధాన్ని పటిష్టం చేశారు.

ఇక బాలయ్యకు బావ అయినా వియ్యంకుడు అయినా చంద్రబాబే. పైగా తన కంటే పదేళ్ళు పెద్ద అయిన చంద్రబాబు అంటే బాలయ్యకు గురుభావం కూడా ఉంది అంటారు. చంద్రబాబులో ఒక గొప్పతనం ఉంది. అదే ఆయనను ఇద్దరు ప్రముఖ టాలీవుడ్ నటులను దగ్గర అయ్యేలా చేసింది. ఒకరు ఎలాగూ బంధువు బంధం అయిన బాలయ్య అయితే మరొకరు పవన్ కళ్యాణ్.

ఈ ఇద్దరికీ బాబులో నచ్చే గుణం ఏంటి అంటే ఆయన ఎదుటివారికి ఇచ్చే మర్యాద. తన కంటే వయసులో అనుభవంలో చిన్న వారు ఎవరైనా కూడా బాబు ఎపుడూ మర్యాదలో తగ్గించరు. బాబు దూరదృష్టికి వ్యూహ రచనా చాతుర్యానికి అది మచ్చుతునక అంటారు.

బాలయ్యకు విపరీతమైన సినీ పాపులారిటీ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ అంటే సినీ జనాలు పూనకాలే పోతారు. అలాంటి ఇద్దరినీ తన వైపునకు తిప్పుకున్న ఘనత చంద్రబాబుదే. అందుకే బాబు జైలు నుంచి బయటకు రాగానే పవన్ కళ్యాణ్ విదేశంలో ఉన్నా ట్వీట్ వేశారు. బాబు రాక కోసం కోట్లాదిమంది జనాలు ఎదురుచూస్తున్నారు అని ఘనంగా చెప్పుకొచ్చారు.

ఇక బాలయ్య అయితే ఈ మధ్యదాకా సినిమా ప్రమోషన్స్ ఇతర వ్యాపకాలలో బిజీగా ఉంటూ వచ్చారు. కానీ బావ జైలు నుంచి బయటకు వస్తున్నారు అని తెలియగానే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద వచ్చి వాలిపోయారు. బాబుని చూసిన వెంటనే ఆయన పాదాలను నమస్కరించారు. చటుక్కున అలా పాదాభివందనం చేశారు. కోడలు బ్రాహ్మణి మనవడు దేవాన్ష్ పక్కన ఉండగానే బాలయ్య చేసిన ఈ పనికి అంతా విస్మయానికి లోను అయ్యారు.

ఒక విధంగా బాలయ్య పూర్తి ఎమోషన్ కి గురి అయ్యారు. బాబుని జైలు బయట చూడగానే ఆనందంతో అలా చేశారు అని అంటున్నారు. బాలయ్య ఇపుడు టాలీవుడ్ లో వరస హిట్స్ తో టాప్ రేంజిలో ఉన్న హీరో. పైగా నందమూరి నట వారసుడు. స్వయాన తనకంటూ స్టేచర్ కలిగిన వారు అటువంటి బాలయ్య బాబుకు వంగి పాదాభివందనం చేయడం అంటే అది ఆయనలో బాబు పట్ల ఉన్న భక్తి ప్రపత్తులను తెలియచేస్తోంది అని అంటున్నారు.

ఇది చూసిన వారు అంతా బాబు అంటే బాలయ్యకు అంత ఇష్టం అని అనుకున్నారు. బాలయ్య టీడీపీకి దూరం బాబు మీద అలక వంటి వార్తలు మీడియాలో రాస్తూంటారు. కానీ ఈ సన్నివేశం చూసిన వారికి అవన్నీ గాలి వార్తలు అనిపించకమానదు. ఎందుకంటే బాలయ్యకు బాబు కంటే ఎవరూ లేరు అన్నది అలా మరోసారి నిరూపితం అయింది.

అదేదో సినిమాలో బావ చెబితే ఏదైనా చేస్తాను అని హీరో అంటాడు. అలా బాబు ఏమి చెప్పినా చేయడానికి బాలయ్య సిద్ధం. బాలయ్యలో పదవీ వ్యామోహం ఉంది ఆయన వారసత్వం కోసం కుర్చీ కోసం చూస్తున్నారు అని టీడీపీ లోపలా బయటా ఎవరు అనుకున్నా తప్పు అని నిరూపించేసారు ఒకే ఒక్క పాదాభివందనంతో. ఎనీ డౌట్స్.