Begin typing your search above and press return to search.

ఓవైపు బాలయ్య.. మరోవైపు చిరు.. ఏం జరిగిందంటే!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.

By:  Tupaki Desk   |   12 Jun 2024 9:30 AM GMT
ఓవైపు బాలయ్య.. మరోవైపు చిరు.. ఏం జరిగిందంటే!
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఓవైపు నారా కుటుంబం, ఇంకోవైపు నందమూరి కుటుంబం, మరోవైపు మెగా కుటుంబం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మెగాస్టార్, పద్మవిభూషణ్‌ చిరంజీవిని ప్రమాణస్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి కుటుంబంతో విజయవాడకు చేరుకున్న చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ నోవాటెల్‌ లో హోటల్‌ లో చిరంజీవి రాత్రి బస చేశారు.

ఇక ప్రమాణస్వీకార కార్యక్రమంలో వేదికపై చిరంజీవి, ఆ పక్కనే తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్, ఆయన సతీమణి లత, ఆమె పక్కన ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీనులయ్యారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ చొరవ అందరినీ ఆకట్టుకుంది. అతిథులకు ఆయన స్వాగతం పలికారు. అందరితో కరచాలనం చేశారు. ముఖ్యంగా చిరంజీవితో బాలకృష్ణ కరచాలనం, వారిద్దరి పరస్పర పలకరింపులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాన్ని కార్యక్రమానికి హాజరైన పలువురు తమ సెల్‌ ఫోన్లలో బంధించడం కనిపించింది. ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు కూడా తమ కెమెరాలను చిరు, బాలయ్య వైపు మళ్లించారు.

చిరంజీవి, బాలకృష్ణ సమకాలికులు. తెలుగు చిత్ర సీమ చూసిన అతిగొప్ప, పెద్ద మాస్‌ హీరోలు.. వీరిద్దరు. ఇందులో ఎవరికీ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇరువురూ ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. అయితే వీరిద్దరూ పరస్పరం గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూనే ఉన్నా.. ఒకరింట్లో ఒకరు శుభ కార్యక్రమాలకు హాజరవుతూనే ఉన్నా.. కొందరు దురభిమానులు విద్వేషం చిమ్మేవారు. అయితే అటు చిరు కానీ, ఇటు బాలయ్య కానీ తమ మధ్య పొరపొచ్చాలకు తావు ఇవ్వలేదు.

బాలయ్య ఎప్పుడైనా ఏదైనా అన్నా.. చిరంజీవి ఆయనను వెనకేసుకొచ్చేవారు. బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వమనేవారు. అలాంటి సంబంధం ఈ ఇరువురు అగ్ర నటుల మధ్య ఉంది. ఇప్పుడు ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. పవన్‌ కళ్యాణ్‌ ను కూడా బాలయ్య తన సోదరుడు అని, పవర్‌ స్టార్‌ అని సంబోధిస్తూ వస్తున్నారు.

దీంతో అటు మెగాభిమానులు, ఇటు నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికీ ఈ రెండు కుటుంబాలు ఇలాగే కలిసి ఉండాలని.. రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు. చిరు, బాలయ్య కరచాలనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.