Begin typing your search above and press return to search.

బాలయ్య డిమాండ్ బాబుకు పెద్ద పని పెడుతుందా ?

ఆయన వరకూ లోకల్ ఎమ్మెల్యేగా ఇది సమ్మతమైన ఆలోచనగా ఉన్నా ఒక్కసారి ఈ జిల్లాల పేర్లు మార్పు జిల్లా కేంద్రాల మార్పు అంటూ జరిగితే మాత్రం కచ్చితంగా అది ఇబ్బందికరం అవుతుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 July 2024 12:30 AM GMT
బాలయ్య డిమాండ్ బాబుకు పెద్ద పని పెడుతుందా ?
X

రాజకీయాల్లో ఎన్నో లెక్కలు ఉంటాయి, మరెన్నో సమీకరణలు ఉంటాయి. వేటికవే చూసుకుంటూ ముందుకు సాగాలి. కులం, మతం ప్రాంతం అన్నవి చాలా సున్నితమైన అంశాలు. రాజకీయంగా అవి ఎటు నుంచి ఎటు అయినా క్షణంలో మారే అంశాలు. అలాంటి వాటిని డీల్ చేసే విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.

వైసీపీ అధికారంలో ఉన్నపుడు కొత్త జిల్లాలు అని 13గా ఉన్నవి కాస్తా 26కి పెంచింది. ఇందులో చాలా చోట్ల స్థానికుల అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు. క్రిష్ణా జిల్లాను రెండుగా విడగొట్టినపుడు ఎన్టీఆర్ పుట్టిన ఊరు ఉన్న మచిలీపట్నానికి ఆయన పేరు పెట్టకుండా విజయవాడ సిటీతో పాటు కలిపిన ప్రాంతాలకు అన్న గారి పేరు పెట్టింది.

అదే సమయంలో విజయవాడకు చెందిన ప్రముఖ నాయకుడు దివంగత వంగవీటి మోహన రంగా పేరుని జిల్లాకు పెట్టాలన్న డిమాండ్ ని ఏ మాత్రం పట్టించుకోలేదు అన్న విమర్శలు వచ్చాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రాంతాన్ని విభజించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టడంతో ఒక వర్గం నుంచి నిరసలను వ్యక్తం అయ్యాయి. అది విధ్వంసానికి కూడా కారణం అయింది.

అలాగే అన్నమయ్య జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటికి చేసి వివాదాని మూటగట్టుకున్నారు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం ఉంటే భీమవరం జిల్లా కేంద్రంగా చేశారు. అలాగే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం గా ఉంటే సత్యసాయి జిల్లాగా చేస్తూ పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేశారు.

ఇలా ఎన్నో రకాలుగా కొత్త జిల్లాలు వివాదం అయ్యాయి. ఆ తరువాత అది కొంత సద్దుమణిగినా మళ్లీ ఏ మాత్రం కదిలించినా పెద్ద రచ్చ అయ్యేలా ఉంది. ఈ నేపధ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లాను హిందూపురం జిల్లాగా మారుస్తామని భారీ ప్రకటన ఇచ్చేశారు.

ఆయన వరకూ లోకల్ ఎమ్మెల్యేగా ఇది సమ్మతమైన ఆలోచనగా ఉన్నా ఒక్కసారి ఈ జిల్లాల పేర్లు మార్పు జిల్లా కేంద్రాల మార్పు అంటూ జరిగితే మాత్రం కచ్చితంగా అది ఇబ్బందికరం అవుతుంది అని అంటున్నారు. అంతే కాదు ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలలో చాలా మటుకు పేర్ల మార్పు సరిహద్దుల మార్పు కోరుకుంటారు అని అంటున్నారు.

అంతే కాదు 26 కాస్తా 32 జిల్లాలుగా మార్చమని సరికొత్త డిమాండ్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. దాంతో బాలయ్య తన డిమాండ్ ముందు పెట్టి బాబుకు పెద్ద పనిని పెట్టబోతున్నారా అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు సైతం వీటి విషయంలో ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు లేవు.

ఎందుకు అంటే వీటిలో తల దూర్చితే కొరివితో తల గోక్కున్నట్లే అవుతుంది అని అంటున్నారు. అసలే కొత్త ప్రభుత్వం ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంకా కుదురుకోవాలి. ఇంతలోనే ఈ తరహా డిమాండ్లు వస్తే కనుక ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అయితే కొన్ని న్యాయమైన డిమాండ్లను జిల్లాల విషయంలో పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చూస్తుందని అయితే అది ఇపుడు కాదని కొంత సమయం తీసుకుని అంతా ఒక దారిన పడ్డాక మాత్రమే అని అంటున్నారు.