బాలయ్యను కట్టడి చేస్తున్నది ఎవరు స్వామీ ?
అక్కడ సీనియర్ ఎన్టీఆర్ మూడు సార్లు హరిక్రిష్ణ ఒకసారి బాలయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
By: Tupaki Desk | 20 May 2024 1:30 AM GMTనందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కి బ్రేక్ వేసేలా ఈసారి హిందూపురంలో భారీ ప్రయత్నాలే జరిగాయా అంటే అవును అని పోలింగ్ అనంతరం అంచనాలు బయటకు వస్తున్నాయి. హిందూపురం సీటు నందమూరి వంశానికి కంచుకోట. అక్కడ సీనియర్ ఎన్టీఆర్ మూడు సార్లు హరిక్రిష్ణ ఒకసారి బాలయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి కూడా బాలయ్య గెలుపు ఖాయమని అంచనాలు ఉన్నాయి.
అయితే బాలయ్యను కట్టడి చేయడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేసింది. దాంతో బాలయ్యకు గట్టి పోటీ ఎదురైంది అని అంటున్నారు. అందులో భాగంగా వైసీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను బరిలోకి దించింది. దీపికను అభ్యర్థిగా ప్రకటించడం వెనక బీసీ కార్డుతో హిందూపురంలో భారీ విజయాన్ని అందుకోవాలనే.
మరో వైపు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం మొత్తం ఎన్నికలను పర్యవేక్షించారు. ఆయన సారధ్యంలోనే మార్పులు చేర్పులు అన్నీ జరిగాయి. ఆయన ప్రతిష్ట గా తీసుకుని హిందూపురంలో శ్రేణులు అన్నింటినీ నడిపించారు.
దాంతో ఈసారి టీడీపీ బీసీ ఓట్లకు గండి కొట్టడానికి వైసీపీ తన వంతుగా ప్రయత్నం చేసి బాలయ్య విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే దానికి తోడు అన్నట్లుగా కాకినాడకు చెందిన పరిపూర్ణానంద స్వామీజీ ఇండిపెండెంట్ గా హిందూపురం నుంచి పోటీ చేయడం.
ఆయన గత మూడేళ్ళుగా హిందూపురంలో మకాం వేసి మరీ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా హిందూపురం ఎంపీ టికెట్ తనకే వస్తుంది అని ఆశించారు. కానీ అది దక్కలేదు. దాంతో ఆయన సొంతంగా పోటీకి దిగారు. దాంతో టీడీపీకి పడే ఓసీ ఓట్లు స్వామీజీ తన వైపునకు తిప్పుకున్నారు అని అంటున్నారు.
స్వామీజీ పోటీ వల్ల టీడీపీ ఓటు బ్యాంక్ కి కూడ గండి పడింది అని అంటున్నారు. స్వామీజీ పోటీ చేయకపోతే ఆ ఓట్లు అన్నీ గంపగుత్తగా టీడీపీకే పడేవి అని అంటున్నారు. అదే విధంగా టీడీపీకి చెందిన కొంతమంది సానుభూతిపరులు కూడా స్వామి వైపు మొగ్గు చూపారు అని అంటున్నారు.
ఇలా టీడీపీ ఓటు బ్యాంకే చాలా వరకూ స్వామీజీ చిల్లు పెట్టారని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ ఓటు బ్యాంక్ అలాగే ఉంది అన్నది పోలింగ్ సరళిని అంచనా వేసుకున్న వారి మాట. దాంతో ఈసారి హిందూపురంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చర్చగా ముందుకు వస్తోంది.
అయితే గతసారి 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన బాలయ్య ఈసారి దానికి మించి గెలుస్తారు అని టీడీపీ ఘంటాపధంగా చెబుతోంది. టీడీపీ ఓట్లు ఎంత చీలినా కూడా బాలయ్యకు ఇబ్బంది లేదని అంటోంది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా టీడీపీకి కొత్తగా వచ్చి చేరిందని పైగా ఇది నందమ్రూరి కోట అని దాంతో ఎలాంటి బెంగా బెదురూ అవసరం లేదని కూడా లెక్క తేల్చేస్తున్నారు.
అయితే వైసీపీ వారి ఆశలు ఎలా ఉన్నాయంటే స్వామీజీ ఓట్ల చీలిక వల్ల బాలయ్య విజయావకాశాలు దెబ్బ తింటాయని దాంతో తమ విజయం ఖాయమని అంటున్నారు. మరి జూన్ 4న వచ్చే ఫలితం ఏమి తెలియచేస్తుందో చూడాలి. అదే సమయంలో స్వామీజీ మొదటిసారి పోటీ చేస్తూ ఎంతమేరకు ఓట్లు సాధించారు అన్నది కూడా చూడాల్సి ఉంది.