Begin typing your search above and press return to search.

జిల్లా పేరు మార్పు, హిందూపురంపై బాలయ్య కీలక వ్యాఖ్యలు!

జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడం వరకూ ఓకే కానీ.. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేయడంపై మాత్రం ఆందోళనలు జరిగాయి.

By:  Tupaki Desk   |   16 Aug 2024 9:21 AM GMT
జిల్లా పేరు మార్పు, హిందూపురంపై బాలయ్య కీలక వ్యాఖ్యలు!
X

గతంలో 13 జిల్లాలతో ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 26జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తూ పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసింది. ఇక్కడే ఓ సమస్య వచ్చింది. జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడం వరకూ ఓకే కానీ.. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేయడంపై మాత్రం ఆందోళనలు జరిగాయి.

ఇక ప్రధానంగా హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అయితే స్వయంగా నాటి నిరసనల్లో పాల్గొన్నారు. హిందూపురంను జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ పాదయాత్రా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే హిందూపురంకు ఆ హోదా తీసుకొస్తామంటూ ప్రకటన చేశారు! ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ఈ విషయంపై స్పందించారు బాలయ్య.

అవును... ఏపీలో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ సమయంలో బాలయ్య తాజాగా హిందూపురంలో పర్యటించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు.. స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో... శ్రీసత్యసాయి జిల్లా క్యాపిటల్ గా హిందూపురం అంశం ప్రస్థావన వచ్చింది.

దీనిపై స్పందించిన బాలయ్య... ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిపారు. జిల్లా పేరు మార్పైతే ఉండదు కానీ... హిందూపురం ను జిల్లా కేంద్రంగా పరిగణించమని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం ఇప్పుడు పుట్టపర్తి నుంచి హిందూపురంకి మారుతుందా? అనే అంశం తెరపైకి వచ్చింది.

కాగా... ఇవాళ హిందూపురంలో సుడిగాలి పర్యటన చేస్తున్న బాలయ్య.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నక్యాంటిన్ ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిమ్ ను ప్రారంభించి, కాసేపు కసరత్తులు చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో హిందూపురం జిల్లా కేంద్రం అనే కామెంట్లు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి.