Begin typing your search above and press return to search.

టీడీపీ ప్రభుత్వంలో బాలయ్య కీలక పాత్రకు రెడీ...!?

బాలయ్య ఈసారి గెలిస్తే టీడీపీ అధికారంలో వస్తే మాత్రం కీలక భూమికను ప్రభుత్వంలో పోషించేందుకు సమాయత్తం అవుతున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 12:30 AM GMT
టీడీపీ ప్రభుత్వంలో బాలయ్య కీలక పాత్రకు రెడీ...!?
X

నందమూరి తారక రామారావు నట వారసుడు నందమూరి బాలక్రిష్ణ అన్నది తెలిసిందే. గత అయిదు దశాబ్దాలుగా బాలయ్య తెలుగు సినీ రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఇక అన్న ఎన్టీయార్ రాజకీయ రంగంలోనూ విశేషంగా రాణించారు. ఆయన పార్టీని పెట్టి తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చారు. మూడు సార్లు సీఎం గా ఏడున్నరరేళ్ల పాటు ఉమడి ఏపీని పాలించారు.

ఎన్టీయార్ కి సినీ వారసులు ఉన్నారు కానీ రాజకీయ వారసుడిగా మాత్రం అల్లుడు చంద్రబాబు మాత్రమే ఉన్నారు. ఆయన తన వారసుడిగా కుమారుడు లోకేష్ ని తయారు చేసుకునే పనిలో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన తన తండ్రి పోటీ చేసి గెలిచి సీఎం అయిన హిందూపురం నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

బాలయ్య ముచ్చటగా మూడవసారి హిందూపురంలో గెలిచేందుకు సిద్ధపడుతున్నారు. బాలయ్య ఈసారి గెలిస్తే టీడీపీ అధికారంలో వస్తే మాత్రం కీలక భూమికను ప్రభుత్వంలో పోషించేందుకు సమాయత్తం అవుతున్నారు అని అంటున్నారు. అంటే బాలయ్య కూడా ప్రభుత్వంలో ఉంటారని అంటున్నారు.

నిజానికి 2014లో బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి వచ్చింది. బాలయ్య మంత్రి అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. అనూహ్యంగా ఆయన అల్లుడు నారా లోకేష్ మాత్రం ఎమ్మెల్సీగా నియమితులై అయిదు కీలక మంత్రిత్వ శాఖలకు రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు.

ఇక 2019లో బాలయ్య జగన్ వేవ్ లో సైతం గెలిచారు. కానీ టీడీపీ ఓటమి పాలు అయింది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. దాంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి కావాల్సిందే అన్నది బాలయ్య అభిమానుల ఆలోచనగా ఉంది. బాలయ్య సైతం ఆ దిశగానే ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు.

తండ్రి సీఎం గా అనేక ఏళ్ళ పాటు చేశారు బాలయ్య మంత్రిగా కూడా ఉండకపోతే ఎలా అన్న చర్చ సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య ప్రస్తుతం చేస్తున్న బాబి డైరెక్షన్ సినిమా తరువాత కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటిస్తారు అన్న ప్రచారం కూడా సాగుతోంది.

అంటే బాలయ్య రాజకీయాల్లో ఇక మీదట ఫుల్ బిజీగా ఉండాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్ మీదనే ఫుల్ ఫోకస్ పెడతారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ బాబీ బాలయ్యల కాంబో మూవీయే ప్రస్తుతానికి లాస్ట్ కావచ్చు అని అంటున్నారు.

బాలయ్య ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే కీలకం అవుతారు అని అంటున్నారు. దానికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు ఈ టెర్మ్ సీఎం అయినా కూడా ఆయన వారసుడిగా లోకేష్ ఉంటారు అని వినిపిస్తోంది. అయితే బాలయ్య బాబు తరువాత సీఎం అని ఆయన అన్న కొడుకు చైతన్య కృష్ణ ఆ మధ్య పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. బాలయ్యకు కూడా రాజకీయాల్లో తన తండ్రి వారసత్వం కొనసాగించాలని కోరిక బలంగా ఉంది అని అంటారు.

అందుకే ఆయన బాబు అరెస్ట్ తరువాత మంగళగిరిలోని కేంద్ర పార్టీ ఆఫీసులో బాబు కుర్చీలో కూర్చుని కొంత హల్ చల్ చేశారు అని గుర్తు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం వస్తే మాత్రం బాలయ్య కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోరని ఆయన తన వంతు పాత్ర ఏంటి అన్నది తప్పకుండా చాటి చెబుతారు అని అంటున్నారు.

ఇంకో వైపు సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా సినిమాలకు విరామం ఇచ్చి పాలిటిక్స్ లోనే పూర్తిగా ఉండాలని అనుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా బాలయ్య పవన్ పాలిటిక్స్ కి అంకితం అవడం మంచి పరిణామం అయినా వారి ఫ్యాన్స్ కి మాత్రం అది ఒకింత ఇబ్బందే అని అంటున్నారు. అయితే వారు సినిమాల్లో లేకపోయినా జనంలో ఉంటూ రోజూ కనిపిస్తారు అన్నదే తృప్తిగా ఉంటుందని చెబుతున్నారు.