జగన్ నా ఆస్తులు కాజేశారు: బాలినేని సంచలన వ్యాఖ్యలు!
జనసేనలో తన ప్రయాణంపైనా బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులతో పనిలేదని.. ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పారు.
By: Tupaki Desk | 14 March 2025 6:58 PMవైసీపీ అధినేత జగన్‌పై ఆ పార్టీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక.. జగన్ లాంటి వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో ఇలాంటి దౌర్భాగ్యం ఉంటుందని కూడా అనుకోలేదని, తను చాలానే కోల్పోయానని చెప్పారు. జగన్ వల్ల తాను, తన కుటుంబం కూడా మానసికంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా చాలానే నష్టపోయామని బాలినే ని చెప్పారు. వైసీపీలోకి చేరిన తర్వాత.. సంపాయించుకున్నది లేదన్నారు.
పైగా తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను వైసీపీలోకి వచ్చాక.. జగన్ కాజేశారని, తన ఆస్తులు, తన అన్న ఆస్తులను కూడా జగన్ కాజేసినట్టు బాలినేని తీవ్ర విమర్శలు చేశారు. ఇక, రాజకీయాలకు జగన్ పనికిరాడన్న ఆయన.. స్వయం కృషి తో జగన్ ఎదగలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకుని జగన్ రాజకీయంగా పైకి వచ్చాడని.. తర్వాత ఆయన పేరును కూడా తొక్కేసే ప్రయత్నం చేశాడని విమ ర్శించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనేక మందిని అరెస్టు చేస్తోందని.. ఈ పరిణామం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని బాలినేని చెప్పారు. దీనికి కారణం.. బలమైన వారిని వదిలేసి.. కోట్ల రూపాయలు దోచుకున్న వారిని వదిలేసి.. చిన్నవారిపై ప్రతాపం చూపుతున్నారని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జగన్‌ను అరెస్టు చేస్తేనే వైసీపీ హయాంలో జరిగిన దోపిడీల కేసులకు న్యాయం చేసినట్టు అవుతుందని బాలినేని చెప్పుకొచ్చారు.
జనసేనలో తన ప్రయాణంపైనా బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులతో పనిలేదని.. ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పారు. తన అడుగులు.. జనసేనతోనే ముందుకు సాగుతాయని తెలిపారు. తన ప్రాణం ఉన్నంత వరకు జనసేనలోనే కొనసాగుతానని చెప్పారు. ఈ క్రమంలో తనకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా.. సంతోషంగానే ఉన్నట్టు తెలిపారు.