Begin typing your search above and press return to search.

జగన్ ను కడిగేస్తూ.. బాలినేని రాజీనామా లేఖా బాణం!

అధిష్ఠానం కూడా వైవీ వైపే నిలవడంతో బాలినేని తన దారి తాను చూసుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 1:17 PM GMT
జగన్ ను కడిగేస్తూ.. బాలినేని రాజీనామా లేఖా బాణం!
X

రాజకీయాల్లో ఒక పార్టీని వీడి మరొక పార్టీలోకి మారేటప్పడు అప్పటివరకు ఉన్న పార్టీని విమర్శిస్తూ వెళ్లడం సహజం. అయితే, అది పార్టీ అధిష్ఠానానికి సంబంధం లేని నాయకులైతే ఫర్వాలేదు. ప్రజలు కూడా లైట్ గా తీసుకుంటారు. కానీ, అధిష్ఠానం సొంత మనుషులే నిలదీస్తే.. అదికూడా విధానాలను కడిగేస్తే చాలా నష్టమే. అధినేతకు తీవ్రమైన సవాల్ గానే నిలుస్తుంది. ఇప్పుడు ఏపీలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అదే పనిచేశారు. వైసీపీ అధినేత జగన్ కు మామ వరుసయ్యే బాలినేని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీని బలోపేతం చేశారన్న పేరుంది. పలుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడమే కాక.. ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ, పార్టీలోనే ఉన్న తన బావమరిది వరుసయ్యే వైవీ సుబ్బారెడ్డితో బాలినేనికి విభేదాలు ఏర్పడ్డాయి. అధిష్ఠానం కూడా వైవీ వైపే నిలవడంతో బాలినేని తన దారి తాను చూసుకున్నారు.


విధానాలు నచ్చలే..

ఎన్నికలకు ముందు కూడా వైసీపీలో బాలినేని కలకలం రేపారు. లైట్ గానే అయినా.. పార్టీని వీడనున్నట్లు సంకేతాలు పంపారు. కానీ అప్పట్లో అధిష్ఠానం సముదాయించడంతో వెనక్కుతగ్గారు. ఇప్పుడు మాత్రం రాజీనామా చేసేశారు. ఈ సందర్భంగా అధినేత జగన్ కు రాసిన లేఖలో తీవ్రమైన విమర్శలు చేశారు. దివంగత వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన బాలినేని.. జగన్ హయాంలోనూ రాజకీయాలు చేసిన బాలినేని.. తనకు వైసీపీలో ఏం నచ్చలేదో స్పష్టం చేశారు.

ఇదీ రాజీనామా లేఖ..

‘కొన్ని కారణాల రీత్యా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కు, పార్టీ సభ్యత్వానికి రాజీనా చేస్తున్నాను.. రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్తే కచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను. ప్రజా శ్రేయస్సే రాజకీయాలకు కొలమానం కదా? విలువలను నమ్ముకున్న నేను ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశాను. ఆ తృప్తి ఉంది. కొంత గర్వంగా కూడా ఉంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు.. వైఎస్‌ కుటుంబానికి సన్నిహితుడినే అయినా, జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఎలాంటి మోహమాటాలకు పోకుండా అడ్డుకున్నా. అంతిమంగా ప్రజా తీర్పును ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే.. నేను ప్రజా నాయకుడిని. ప్రజల తీర్పే నాకు శిరోధార్యం.. రాజకీయాల్లో భాష గౌరంగా హుందాగా ఉండాలని నమ్మే నికార్సైన రాజకీయం నేను చేశాను.. కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకొనప్పుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే.. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా శక్తి మేరకు సాయం చేశాను. అందరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు.

భాషనే ఎత్తిచూపిన బాలినేని..

బాలినేని వైసీపీ అనుసరించిన రాజకీయ విధానాలను విమర్శిస్తున్న నేపథ్యంలో.. భాష గురించి లేఖలో ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం ఉండగా ఏపీలో భాష విషయంలో మంత్రులు, నాయకులు పరిధి దాటి వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పడు బాలినేని రాజీనామా లేఖలో అదే విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. అంతేకాదు.. జగన్ విధానాలు నచ్చలేదని కూడా పేర్కొన్నారు. ప్రజా తీర్పును వైసీపీ నాయకత్వం హుందాగా స్వీకరించలేదనే అర్థంలో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. విలువల విషయంలోనూ బాలినేని గుర్తుచేశారు. వాటిని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదేనని పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు గురించి.. తన రాజీనామా లేఖలో రాశారంటే.. జగన్ ప్రభుత్వం దానిని విస్మరించిందా? అనే అర్థంలో చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.